ఎన్నికల్లో ఓడిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించకూడదు: రవిశంకర్ ప్రసాద్

ABN , First Publish Date - 2020-05-31T00:01:02+05:30 IST

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్షాలపై మరోమారు విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో పదేపదే

ఎన్నికల్లో ఓడిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించకూడదు: రవిశంకర్ ప్రసాద్

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్షాలపై మరోమారు విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో పదేపదే ఓడిపోతున్నవారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించకూడదని అన్నారు. ‘ఆజ్‌తక్’ ఈ-అజెండాలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికుల విషయంలో ఇటీవల సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.


‘‘క్షేత్రస్థాయి పరిస్థితులను మెరుగుపరిచేందుకు తామేం చేశామన్న విషయాన్ని కోర్టుకు వెళ్తున్న వారు చెప్పాలని సొలిసిటర్ జనరల్ ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఎందుకు అడగరు? నేను ఎవరి పేరును ప్రస్తావించడం లేదు. కానీ, ఇది నిజం కాదా? వీరు (పిటిషనర్లు) రాజకీయ ఒత్తిడిలో మునిగిపోతారు? అని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.  వారు మరెవరో కాదని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసన చేయడానికి ప్రయత్నించిన వారేనంటూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.


ఈ రోజు తమను ప్రశ్నిస్తున్నవారు ఆ రోజు ఎమర్జెన్సీని విధించినవారేనని కాంగ్రెస్‌ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడాం. దెబ్బలు తిన్నాం. జైలు పాలయ్యాం’’ అని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ‘‘మేం న్యాయవ్యవస్థ స్వతంత్రకు బద్ధులమై ఉన్నాం. అయితే, నేను ఒక విషయాన్ని చాలా సీరియస్‌గా చెప్పాలనుకుంటున్నా. ఎన్నికల్లో పదేపదే ఓడిపోతున్నవారు జాతీయ రాజకీయాలను కోర్టుల ద్వారా నియంత్రించకూడదు’’ అని మంత్రి పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-31T00:01:02+05:30 IST