రేషన్ కార్డుదారులకు రూ.వెయ్యి : సీఎం వెల్లడి
ABN , First Publish Date - 2020-06-16T15:02:13+05:30 IST
చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30 వరకు (12 రోజులు) కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్య మంత్రి ఎడప్పాడి

చెన్నై : చెన్నై సహా నాలుగు జిల్లాల్లో ఈనెల 19 నుంచి 30 వరకు (12 రోజులు) కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు ముఖ్య మంత్రి ఎడప్పాడి పళనిస్వామి వెల్లడించారు. వైద్యనిపుణుల కమిటీ సిఫార్సులతో పాటు ఆ తరవాత జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. అదే సమయంలో గ్రేటర్ చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలోకి వచ్చే చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లా ల్లో గ్రేటర్ చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్న బియ్యం రేషన్‌కార్డుదారులకు రూ.1000ల నగదు పంపిణీ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. చెన్నై సహా నాలుగు జిల్లాల్లో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ అధికమవుతుండటంతో ఆ వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం సంపూర్ణ లాక్‌డౌన్ విధి స్తోందన్నారు. ఇక ఈనెల 21, 28 తేదీలు ఆదివారాల్లో నాలుగు జిల్లాల్లో ఎలాంటి సడలింపులు లేకుండా సంపూర్ణంగా కర్ఫ్యూ విధిస్తామని, ఆ రెండు రోజులూ ఎలాంటి వాహన, జనసంచారం ఉండదని స్పష్టం చేశారు. ఈనెల 19 నుంచి 30 వ తేదీ రాత్రి 12 గంటల వరకు చెన్నై సహా నాలుగు జిల్లాల్లో విధించనున్న నిబంధనలను ఆయన విడుదల చేశారు. ఆ మేరకు గ్రేటర్ చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలోనూ, తిరువళ్లూరు జిల్లాలోని చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో, తిరువళ్లూరు మున్సిపాలిటీ, గుమ్మిడిపూండి, పొన్నేరి, మీంజూరు నగర పంచాయతీలు, పూందమల్లి, ఈక్కాడు, చోళవరం పట్టణ పంచాయతీల్లో, చెంగల్పట్టు జిల్లాలోని చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రాంతా ల్లోనూ, చెంగల్పట్టు, మరైమలర్‌నగర్, నందివరం, గూడువాంజేరి, కాట్టాన్‌కొళత్తూరు, కాంచీపురం జిల్లాలోని చెన్నై పోలీసుసర్కిల్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లోనూ కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలుచేస్తారు.
- ఆస్పత్రులు, ల్యాబ్‌లు, అంబులెన్స్‌లు, మార్చురీ వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవు.
- అద్దె ఆటోలు, టాక్సీలు, ప్రైవేటు టాక్సీ సర్వీసులు నడిపేందుకు అనుమతి లేదు. అత్యవసర సేవలకు మాత్రమే ఆటోలు, టాక్సీ సర్వీసులు వాడేందుకు అనుమతి.
- ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో 19 నుంచి 33 శాతం ఉద్యోగులు మాత్రమే పనిచేయడానికి అనుమతి.
- కంటైన్మెంట్ జోన్లలో పనిచేసేవారు ఈనెల 19 నుంచి విధులకు రవాల్సిన అవసరం లేదు.
- బ్యాంకులు 35 శాతం ఉద్యోగులతో పనిచేస్తాయి. ఏటీఎంలు తెరుస్తారు.
- కూరగాయలు, కిరాణా సరకులు విక్రయించే నిత్యా వసర వస్తువుల దుకాణాలు రెండు ఆదివారాలు (జూన్ 21, 28) మినహా తక్కిన రోజుల్లో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకే తెరచి ఉంచుతారు.
- కంటైన్మెంట్ జోన్లలో నిత్యావసర వస్తువుల దుకాణాలకు అనుమతి లేదు. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ప్రభుత్వమే నిత్యావసర వస్తువులను దుకాణాల ద్వారా సరఫరా చేయిస్తుంది.
- నాలుగు జిల్లాలకు చెందిన ప్రజలు రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న కూరగాయలలు, కిరాణా దుకాణాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి.
- హోటళ్లలో ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు పార్శిళ్లను విక్రయించేందుకు మాత్రమే అనుమతి.
- అమ్మా క్యాంటీన్లు మూడు పూటలా తెరచి ఉంచు తారు.
- లాక్‌డౌన్ బాధితులకు స్వచ్చంద సంస్థలు సహా యాలు పంపిణీ చేసేందుకు స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి
- లాక్‌డౌన్ రోజుల్లో సరకుల రవాణా చేసే వాహనాలు, నిత్యావసర వస్తువులు తీసుకెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవు.
- వివాహాలు, వైద్యం కోసం వెళ్లేవారు, అంత్య క్రియలకు వెళ్లేవారికి ఈ-పాస్‌లు జారీ చేస్తారు.
- చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఈ నెల 19 నుంచి 30వరకూ టీ దుకాణాలకు అనుమతిలేదు.
- ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లు, విమాన సర్వీసులు, విదేశాల నుంచి వచ్చే విమాన సర్వీసులకు ఇప్పుడున్న సడలింపులే కొనసాగుతాయి. రైళ్లల్లో, విమానా ల్లో వచ్చేవారికి కరోనా పరీక్షలు జరిపి ఏడు రోజులు, 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచడం వంటి నిబంధనలు అమలు చేస్తారు.
రేషన్ కార్డుదారులకు రూ.1000లు...
ఈనెల 19 నుంచి 12 రోజులపాటు కఠిన లాక్‌డౌన్ విధించనుండటంతో ప్రభుత్వ బియ్యం రేషన్ కార్డుదారు లకు రూ.1000 నగదును అందజేయనుంది. ఈ నగదు కానుకను గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న వారికి, తిరువళ్లూరు జిల్లాలో చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న తిరువళ్లూరు మునిసిపాలిటీ, గుమ్మిడి పూండి, పొన్నేరి, మీంజూరు నగర పంచాయితీలు, పూంద మల్లి, ఈక్కాడు, చోళవరం పట్టణపంచాయతీలకు చెందిన బియ్యం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ఇదే రీతిలో చెంగల్పట్టు జిల్లాల్లో చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న చెంగల్పట్టు, మరైమలర్‌నగర్ మున్సి పాలిటీలు, నందివరం, గూడువాంజేరి, కాట్టాన్‌కొళత్తూరు ప్రాంతాలకు చెందినవారికి అందజేస్తారు. కాంచీపురం జిల్లాలో చెన్నై పోలీసు సర్కిల్ పరిధిలో ఉన్న ప్రాంతా లకు చెందిన కార్డుదారులకు రేషన్‌షాపులలో నగదు కానుకను పంపిణీ చేస్తారు.