ఆ వార్తలు నిజం కాదు.. కరోనా కలకలంపై స్పందించిన రాష్ట్రపతి భవన్

ABN , First Publish Date - 2020-04-22T02:38:29+05:30 IST

రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో దాదాపు

ఆ వార్తలు నిజం కాదు.. కరోనా కలకలంపై స్పందించిన రాష్ట్రపతి భవన్

న్యూఢిల్లీ: రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో దాదాపు వందమందికిపైగా ఉద్యోగులను క్వారంటైన్‌కు పంపినట్టు ఈ ఉదయం వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తాజాగా, ఈ వార్తలపై రాష్ట్రపతి భవన్ స్పందించింది. ఆ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగుల్లో ఉద్యోగుల్లో ఎవరికీ కరోనా సోకలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల్లో ఎవరికీ వైరస్ సంక్రమించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు రాష్ట్రపతి భవన్ వివరించింది.


వార్తల్లో ప్రచారం అవుతున్నట్టుగా ఈ నెల 13న బీఎల్ కపూర్ ఆసుపత్రిలో మృతి చెందిన సెంట్రల్ ఢిల్లీకి చెందిన వ్యక్తికి రాష్ట్రపతి భవన్‌కు ఎటువంటి సంబంధం లేదని, అతడు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఉద్యోగి కాదని పేర్కొంది. అయితే, రాష్ట్రపతి సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరు కరోనా పాజిటివ్ వ్యక్తితో సన్నిహితంగా మెలిగినట్టు తెలియడంతో ఆ కుటుంబంలోని ఏడుగురిని మాత్రం క్వారంటైన్‌కు తరలించినట్టు తెలిపింది. వారికి నిర్వహించిన పరీక్షల్లో ఎవరికీ కరోనా సోకినట్టు నిర్ధారణ కాలేదని రాష్ట్రపతి భవన్ వివరించింది.

Updated Date - 2020-04-22T02:38:29+05:30 IST