ఈడీ సమన్లపై వాయిదా కోరిన సీఎం తనయుడు

ABN , First Publish Date - 2020-11-06T19:12:47+05:30 IST

'ఫెమా' కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై ..

ఈడీ సమన్లపై వాయిదా కోరిన సీఎం తనయుడు

న్యూఢిల్లీ: 'ఫెమా' కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లపై పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తనయుడు రణీందర్ సింగ్ వాయిదా కోరారు. ఆరోగ్య కారణాల రీత్యా తాను హాజరు కాలేకపోతున్నట్టు ఈడీని రణీందర్ కోరినట్టు ఆయన తరఫు న్యాయవాది జైవీర్ షేర్గిల్ తెలిపారు. శుక్రవారంనాడిక్కడ మీడియాతో షేర్గిల్ మాట్లాడుతూ, తన క్లయింట్ తీవ్రమైన జర్వం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడని చెప్పారు. కోవిడ్-19 పరీక్ష కోసం శాంపుల్స్ కూడా ఇచ్చాడని తెలిపారు. కేవలం ఆరోగ్య కారణాలు, తనతో పాటు ఇతరుల భద్రతను పరిగణనలోకి తీసుకునే తన క్లయింట్ ఈ వాయిదా కోరినట్టు చెప్పారు. శుక్రవారంనాడు ఈడీ ముందుకు ఆయన హాజరుకావడం లేదని వెల్లడించారు.


విదేశీ మారకద్రవ్య నియంత్రణా చట్టం (ఫెమా) కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న రణీందర్‌ను ప్రశ్నించేందుకు ఈడీ ఇటీవల సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కూడా ఆయన ఒలంపిక్స్ గేమ్స్‌కు సంబంధించి పార్లమెంటరీ కమిటీ ముందు హాజరుకావాల్సి ఉందంటూ ఈడీని వాయిదా కోరారు. ఆల్పైన్ దేశంలో రణీందర్ అకౌంట్ కలిగి ఉన్నాడంటూ ఆదాయం పన్ను శాఖకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉండటంతో ఈడీ ఈ సమన్లు జారీ చేసింది.

Updated Date - 2020-11-06T19:12:47+05:30 IST