రామాలయ నిర్మాణంపై కాంగ్రెస్ సీనియర్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..!

ABN , First Publish Date - 2020-08-01T23:55:10+05:30 IST

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం జరిగే భూమి పూజకు సరిగ్గా నాలుగు రోజుల ముందు...

రామాలయ నిర్మాణంపై కాంగ్రెస్ సీనియర్ నేతల ఆసక్తికర వ్యాఖ్యలు..!

భోపాల్: అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం జరిగే భూమి పూజకు సరిగ్గా నాలుగు రోజుల ముందు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ప్రతిఒక్కరి సమ్మతి మేరకే అయోధ్యలో రామాలయ నిర్మాణం సాకారమవుతోందనీ.. ఆలయ నిర్మాణాన్ని తాను స్వాగతిస్తున్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌ నాథ్ పేర్కొన్నారు. ‘‘అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని నేను స్వాగతిస్తున్నాను. దీనికోసం దేశంలోని ప్రజలంతా ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ప్రతిఒక్క భారతీయుడి సమ్మతి మేరకే ఆలయ నిర్మాణం సాకారం అవుతోంది. ఇది భారత దేశంలో మాత్రమే సాధ్యం..’’ అని కమల్‌నాథ్ పేర్కొన్నారు.


కాగా మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సైతం రామాలయ నిర్మాణాన్ని స్వాగతించారు. దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ రామాలయం నిర్మాణం జరగాలని కోరుకున్నారనీ.. శ్రీరాముడు ప్రతిఒక్కరి విశ్వాసానికి కేంద్రమని ఆయన పేర్కొన్నారు. ‘‘మన విశ్వాసానికి మూలం శ్రీరాముడు. శ్రీరాముడి మీద విశ్వాసం కారణంగానే దేశం ఇవాళ ఇలా నడుస్తోంది. అందుకే శ్రీరాముడి జన్మస్థలంలో ఆలయ నిర్మాణాన్ని మేము స్వాగతిస్తున్నాం. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కూడా రామాలయం నిర్మాణం జరగాలని కోరుకున్నారు...’’ అని సింగ్ పేర్కొన్నారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత నరోత్తమ్ మిశ్రా తనదైన శైలిలో స్పందించారు. ‘‘కొందరు విమర్శించడమే అలవాటుగా పెట్టుకుంటారు. అందులోనే మంచిని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. కనీసం విమర్శల్లోనైనా శ్రీరాముడిని గుర్తుచేసుకున్నందుకు సంతోషం...’’ అని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రామాలయ నిర్మాణాన్ని జాప్యం చేసేందుకే ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2020-08-01T23:55:10+05:30 IST