రాహుల్ గాంధీపై రామ్ మాధవ్ తీవ్ర ఆగ్రహం

ABN , First Publish Date - 2020-08-16T21:32:14+05:30 IST

లడఖ్‌లో చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ

రాహుల్ గాంధీపై రామ్ మాధవ్ తీవ్ర ఆగ్రహం

పాట్నా : లడఖ్‌లో చైనాతో ఏర్పడిన ప్రతిష్టంభనపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్రంగా ఖండించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 


మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి రెండో వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రామ్ మాధవ్ ఆదివారం పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట బురుజుల నుంచి ప్రసంగించారన్నారు. భారతీయ సైనికులు చేసిన త్యాగాలను ప్రశంసించారన్నారు. ఈ మాటలను విన్న ఓ వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, దానికి ఎన్ని డిగ్రీల తీవ్రత ఉందో దేశం నిర్ణయించుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. 


రాహుల్ గాంధీ అంతకు ముందు ప్రధాన మంత్రి మోదీపై ట్విటర్ వేదికగా విరుచుకుపడ్డారు. తూర్పు లడఖ్‌లో ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. భారత భూబాగాన్ని తీసుకోవడానికి చైనాకు మోదీ అవకాశం ఇచ్చారన్నారు. భారత సైన్యం శక్తి, సామర్థ్యాలు, శౌర్య పరాక్రమాలపై పీఎం మోదీకి తప్ప, ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉందన్నారు. ఆయన పిరికితనం వల్ల మన భూభాగాన్ని తీసుకునేందుకు చైనాకు అవకాశం లభించిందన్నారు. ఆయన అబద్ధాలు మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకునేలా చేస్తాయన్నారు. 


Updated Date - 2020-08-16T21:32:14+05:30 IST