నేడు రాజ్యసభ సభ్యుల ప్రమాణం

ABN , First Publish Date - 2020-07-22T12:48:10+05:30 IST

రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 61 మంది సభ్యులు బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు.

నేడు రాజ్యసభ సభ్యుల ప్రమాణం

కరోనా కారణంగా గైర్హాజరుకానున్న టీఆర్‌ఎస్‌ సభ్యులు

ఢిల్లీకి చేరుకున్న వైసీపీ సభ్యులు

సమావేశాలు జరగనప్పుడు ప్రమాణాలు జరగడం ఇదే తొలిసారి 


న్యూఢిల్లీ, (ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు ఇటీవల ఎన్నికైన 61 మంది సభ్యులు బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సమావేశాలు జరగనప్పుడు సభలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగడం రాజ్యసభ చరిత్రలో ఇదే తొలిసారి. అయితే, కరోనా కారణంగా దాదాపు 15 మందికిపైగా కొత్త సభ్యులు గైర్హాజరవుతారని సమాచారం. అందులో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన కే కేశవరావు, కేఆర్‌ సురేష్‌ రెడ్డి ఉన్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి రావడం సురక్షితం కాదని వారు భావిస్తున్నట్లు తెలిసింది.


వర్షాకాల సమావేశాలు జరిగే సమయంలో ప్రమాణం చేయాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికైన నలుగురు వైసీపీ సభ్యుల్లో పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి మంగళవారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వాని ప్రమాణస్వీకారం చేసే విషయంలో స్పష్టత లేదు. మరోవైపు రాజ్యసభకు ఎన్నికైన మాజీ ప్రధాని దేవెగౌడ, డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ తదితరులు బుధవారం ప్రమాణం చేయడం లేదు. తమ పార్టీ నుంచి ఎన్నికైన నలుగురు సభ్యులూ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరవుతారని తృణముల్‌ కాంగ్రెస్‌ రాజ్యసభాపక్ష నేత డెరెక్‌ ఓబ్రెయిన్‌ వెంకయ్యకు లేఖ రాశారు. కరోనా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 


పార్లమెంటులో యాంటీజెన్‌ టెస్టులు

ప్రమాణస్వీకారం కోసం ఢిల్లీకి వస్తున్న సభ్యులు, వారి వెంట వచ్చే ఒక అతిథి ముందే కరోనా పరీక్షలు చేయించుకోవాలని రాజ్యసభ సచివాలయం స్పష్టం చేసింది. ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది. అయితే, పార్లమెంటులోనూ సభ్యుడికి, అతనికి తోడుగా వచ్చిన వ్యక్తికి ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టులు చేయడానికి ఏర్పాటు చేశామని వెల్లడించింది. కాగా, మాస్కులు, ఫేస్‌ షీల్డ్‌లు, గ్లోవ్స్‌ వంటివి ధరించాలని సూచించింది. 


Updated Date - 2020-07-22T12:48:10+05:30 IST