భారత్-చైనా చర్చలపై కుండబద్దలుకొట్టిన రాజ్‌నాథ్ సింగ్

ABN , First Publish Date - 2020-12-30T18:33:44+05:30 IST

భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఏర్పడిన

భారత్-చైనా చర్చలపై కుండబద్దలుకొట్టిన రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ : భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఏర్పడిన ప్రతిష్టంభనపై జరుగుతున్న చర్చల్లో సానుకూల ఫలితాలు లేవని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. తూర్పు లడఖ్‌లో యథాతథ స్థితి కొనసాగుతోందని, చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సకారాత్మక పరిణామాలేవీ లేవని చెప్పారు. మిలిటరీ లెవెల్ చర్చలు మరొకసారి జరుగుతాయని చెప్పారు. 


యథాతథ స్థితి కొనసాగుతుండటం సకారాత్మక పరిణామంగా తాను భావించడం లేదన్నారు. యథాతథ స్థితి ఉన్నపుడు దళాల మోహరింపును తగ్గించకపోవడం సహజమేనన్నారు. లడఖ్ సరిహద్దుల్లో సైన్యం మోహరింపును తగ్గించబోమని తెలిపారు. చైనా కూడా తన దళాలను తగ్గించే అవకాశం లేదన్నారు. చర్చలు సత్ఫలితాలిస్తాయని తాము భావిస్తున్నామన్నారు. విస్తరణవాదంతో ఏ దేశమైనా మన భూమిని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే, ఇతరుల చేతికి మన భూమి వెళ్ళకుండా కాపాడుకునే శక్తి, సామర్థ్యాలు మన దేశానికి ఉన్నాయన్నారు. ప్రపంచంలోని ఏ దేశం అయినా విస్తరణవాదంతో రగిలిపోతే, దానిని నిరోధించే సత్తా భారత దేశానికి ఉందన్నారు. 


గత ప్రభుత్వాలను తాను ప్రశ్నించాలనుకోవడం లేదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మన దేశం దేశ భద్రతకు పెద్ద పీట వేస్తోందని చెప్పారు. రక్షణ దళాలకు గరిష్ఠ సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. 


Updated Date - 2020-12-30T18:33:44+05:30 IST