కోవిడ్-19 : సాయుధ దళాల సన్నద్ధతపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

ABN , First Publish Date - 2020-04-24T23:26:03+05:30 IST

మహమ్మారి నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయుధ

కోవిడ్-19 : సాయుధ దళాల సన్నద్ధతపై రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయుధ దళాల సన్నద్ధతను సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, సైనిక దళాధిపతి ఎంఎం నరవనే, నావికా దళాధిపతి అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భడౌరియా, డిఫెన్స్ సెక్రటరీ డాక్టర్ అజయ్ కుమార్, సెక్రటరీ డిఫెన్స్ (ఫైనాన్స్) గార్గి కౌల్ పాల్గొన్నారు.


కర్తవ్య నిర్వహణకు కార్యరంగంలోకి దూకే సన్నద్ధతతో పాటు, కోవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి తీసుకుంటున్న చర్యలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్షించారు. స్థానిక పౌర పాలనా యంత్రాంగానికి సహాయపడుతున్నందుకు, కోవిడ్-19పై పోరాటానికి గట్టి చర్యలు తీసుకుంటున్నందుకు సాయుధ దళాలను అభినందించారు. 


సాయుధ దళాలు కోవిడ్-19పై పోరాడటంతోపాటు తమ కర్తవ్య నిర్వహణకు సిద్దంగా ఉండాలని రాజ్‌నాథ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని శత్రువులు తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. 


కోవిడ్-19 కారణంగా ఆర్థిక భారం పడుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక వనరులను వృథా చేయకుండా, జాగ్రత్తగా వినియోగించాలని కోరారు. 


అష్ట దిగ్బంధనం ముగిసిన తర్వాత ఆర్థికంగా కోలుకోవడానికి దోహదపడే చర్యలను గుర్తించాలని త్రివిధ దళాల అధిపతులను  కోరారు. 


ఈ సందర్భంగా కమాండర్లు తాజా పరిస్థితులను ప్రస్తావించారు. వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి, ఔషధాలను సేకరించడానికి తమకు అత్యవసర ఆర్థిక అధికారాలు కల్పించడం పట్ల ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ అధికారాలు కల్పించడం వల్ల సకాలంలో చర్యలు చేపట్టడానికి వీలైందని తెలిపారు.


Updated Date - 2020-04-24T23:26:03+05:30 IST