డార్జిలింగ్ బయల్దేరిన రాజ్‌నాథ్ సింగ్
ABN , First Publish Date - 2020-10-24T20:25:20+05:30 IST
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో పర్యటించేందుకు

న్యూఢిల్లీ : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో పర్యటించేందుకు శనివారం న్యూఢిల్లీ నుంచి బయల్దేరారు. న్యూఢిల్లీ నుంచి ఆయన డార్జిలింగ్ వెళ్తారు. ఫార్వర్డ్ ఏరియాస్‌లోని భద్రతా దళాలతో ఆయన మాట్లాడతారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిక్కింలో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తారు. రాజ్‌నాథ్ సింగ్ శనివారం ఓ ట్వీట్‌లో ఈ వివరాలు తెలిపారు.
‘‘పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రెండు రోజులపాటు పర్యటించేందుకు డార్జిలింగ్ వెళ్తున్నాను. నేను ఫార్వర్డ్ ఏరియాస్ సందర్శిస్తాను. భద్రతా దళాలతో మాట్లాడతాను. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిక్కింలో నిర్మించిన రోడ్డును ప్రారంభిస్తాను’’ అని రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశ సైన్యానికి ఎదురెదురుగా ఉన్న భారత సైన్యంలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు రాజ్‌నాథ్ వెళ్తున్నారు. చైనా సరిహద్దుల్లోని సిక్కింలో ఉన్న స్థానిక భద్రతా దళాల స్థావరంలో దసరా సందర్భంగా ఆయన శస్త్ర పూజ చేసే అవకాశం ఉంది. గత ఏడాది ఆయన రఫేల్ యుద్ధ విమానాన్ని స్వీకరించినపుడు ఫ్రాన్స్‌లో ఆయుధ పూజ చేసిన సంగతి తెలిసిందే.
వాస్తవాధీన రేఖ వెంబడి తూర్పు లడఖ్‌లో భారత్- చైనా మధ్య మే నెల నుంచి ప్రతిష్టంభన కొనసాగుతోంది. అనేక దఫాలుగా సైనిక కమాండర్ల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం లేదు. చైనా సైన్యాన్ని తిప్పికొట్టేందుకు భారత దేశం దాదాపు 60 వేల మంది సైన్యాన్ని మోహరించింది.