రాజీవ్‌ శర్మపై నకిలీ సాక్ష్యాలు కల్పించారు!

ABN , First Publish Date - 2020-09-21T07:41:28+05:30 IST

చైనాకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టైన జర్నలిస్టు రాజీవ్‌ శర్మ కేసులో సాక్ష్యాలు పోలీసుల కల్పితమని ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు...

రాజీవ్‌ శర్మపై నకిలీ సాక్ష్యాలు కల్పించారు!

  • ఢిల్లీ జర్నలిస్టు కేసులో న్యాయవాది ఆరోపణలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: చైనాకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్టైన జర్నలిస్టు రాజీవ్‌ శర్మ కేసులో సాక్ష్యాలు పోలీసుల కల్పితమని ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు. ఢిల్లీకి చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు రాజీవ్‌ శర్మను అధికారిక రహస్యాల చట్టం కింద ఈ నెల 14న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరపున వాదిస్తున్న సీనియర్‌ అడ్వకేటు ఆదీశ్‌ అగర్వాలా తాజాగా ఢిల్లీ పోలీసులపై మండిపడ్డారు.


‘‘శర్మ చైనా పత్రికకు వ్యాసాలు రాయలేదని మేము అనట్లేదు. కానీ.. చైనాతో మనకు ఇంకా లావాదేవీలు కొనసాగుతున్నాయి. ఇక్కడి వారు అక్కడ పలు సంస్థల్లో, అక్కడి పౌరులు ఇక్కడ పలు సంస్థల్లో పనిచేస్తున్నారు. ఇదేమీ నేరం కాదే! కానీ మా సమస్యల్లా..  రాజీవ్‌ ఇంట్లో సాక్ష్యాధారాలు దొరికాయని పోలీసులు అవాస్తవం చెబుతున్నారు. 14న శర్మను అరెస్టు చేసినప్పుడు ఆయన ఇంట్లో ఏ ఆధారాలు లభ్యం కాలేదు. నకిలీ సాక్ష్యాల్ని పోలీసులే సృష్టించారు. ఒక తప్పుడు కేసులో ఆయన్ను ఇరికించారు. ఒకవేళ ఇంట్లోనే సాక్ష్యాలు లభ్యమైనట్లైతే.. రక్షణ శాఖకు సంబంధించిన అధికారులపై ఇప్పటికే విచారణ మొదలుకావాలి కదా? అదీ లేదు. శర్మను అరెస్టు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నకలును ఆన్‌లైన్‌లో పెట్టలేదు. ఎన్నిసార్లు కోరినా మాకు కూడా ఇవ్వలేదు. న్యాయవాదిని, కుటుంబసభ్యుల్ని కలిసేందుకూ ఆయనను అనుమతించలేదు’’ అని ఆదీశ్‌ స్పష్టం చేశారు. 


Updated Date - 2020-09-21T07:41:28+05:30 IST