రజనీకాంత్ తమిళంలో చేసిన ప్రకటనలో ఏముందంటే...

ABN , First Publish Date - 2020-12-30T17:45:35+05:30 IST

రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎట్టకేలకు తేల్చేశారు. సరికొత్త ఉత్సాహంతో...

రజనీకాంత్ తమిళంలో చేసిన ప్రకటనలో ఏముందంటే...

రాజకీయాలపై తలైవర్‌ వెనకడుగు

అభిమానుల్లో నిర్వేదం..

ప్రత్యర్థుల్లో ఉత్సాహం 


చెన్నై(ఆంధ్రజ్యోతి): రాజకీయ ప్రవేశంపై ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఎట్టకేలకు తేల్చేశారు. సరికొత్త ఉత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలనుకున్న ఆయన అభిమానుల్ని తీవ్ర నిరాశలో ముంచేశారు. అదిగో, ఇదిగో అంటూ ఇన్నాళ్లూ చెబుతూ వచ్చిన ఆయన.. ఇక లేనే లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాలేనని, పార్టీ ప్రకటన చేయడం లేదని తేల్చి చెప్పారు. అనారోగ్యం కారణంగా వైద్యులు చేసిన హెచ్చరికలను చెబుతూనే.. కరోనా వైరస్‌ కారణంగా తన వెన్నంటి వున్నవారితో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడతారని, తన సభల వల్ల వారికి ముప్పు వాటిల్లడం తనకిష్టం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు రజనీ మంగళవారం మూడు పేజీల బహిరంగ ప్రకటన విడుదల చేశారు.


ఆ ప్రకటనలో ఏం చెప్పారంటే..?!

‘నాకు జీవితాన్ని ప్రసాదిస్తున్న దైవసమానులైన తమిళ ప్రజలకు నా కృతజ్ఞతలు. జనవరిలో పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించి, వైద్యుల సూచనలను సైతం కాలదన్ని ‘అన్నాత్తే’ షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వెళ్లాను. సుమారు 120 మందితో షూటింగ్‌ చేశాం. ప్రతిరోజూ కరోనా పరీక్షలు చేయించుకుంటూ, ఎవరికి వారు క్వారంటైన్‌లో వుంటూ, మాస్కు ధరించి, చాలా జాగ్రత్తలతో షూటింగ్‌ చేశాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా నలుగురికి పాజిటివ్‌ అని తేలింది. వెంటనే  షూటింగ్‌ నిలిపేయగా, నాతో పాటు అందరికీ కరోనా పరీక్షలు చేయించారు. నాకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. కానీ రక్తపోటు అధికమైంది. ఇప్పటికే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని వున్నందున రక్తపోటు హెచ్చుతగ్గులుగా ఉండకూడదని వైద్యులు చెప్పారు. వారి సూచనల మేరకు మూడు రోజుల పాటు హైదరాబాద్‌ ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. నా ఆరోగ్య పరిస్థితిని చూసి ప్రొడ్యూసర్‌ కళానిధిమారన్‌ షూటింగ్‌ వాయిదా వేయడంతో అనేకమందికి జీవనోపాధి పోయింది. కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లింది. వీటన్నింటికీ కారణం నా ఆరోగ్య పరిస్థితే. ఇది దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నా.


నేను పార్టీ ప్రారంభించాక మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే ప్రచారం చేస్తే అది ప్రజల్లోకి వెళ్లదు. నేను అనుకున్న విజయాన్ని సాధించలేను. ఈ నిజాన్ని రాజకీయ అనుభవమున్న వారెవ్వరూ కాదనలేరు. రాజకీయ ప్రవేశం చేశాక సమావేశాలు నిర్వహించి, ప్రచారంలో భాగంగా లక్షలాదిమందిని కలుసుకోవాల్సి వస్తుంది. 120 మందితో కూడిన బృందంలోనే కరోనా పాజిటివ్‌ వచ్చి నేను మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా కొత్తరూపం సంతరించుకుంది. వ్యాక్సిన్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పటికే రోగ నిరోధక శక్తి పెంచే మాత్రలను తీసుకుంటున్నాను. అలాంటప్పుడు ప్రజలను నేరుగా కలుసుకుని ప్రచారం చేస్తే నాకూ, దాని వల్ల ప్రజలకు వైరస్‌ వ్యాపించే ప్రమాదం వుంది. నాతో పాటు రాజకీయ ప్రయాణం చేసే వారికి కూడా పలు ఇబ్బందులు, సమస్యలు తెచ్చినట్టే అవుతుంది. వారు మానసికంగా, శారీరకం గానూ, ఆర్థికంగానూ సమస్యలు ఎదుర్కొవాల్సి వుంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదని భావిస్తున్నాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. నేను ఇచ్చిన మాటను మాత్రం తప్పను.


నేను రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి, ఇప్పుడు రావడం లేదని చెబితే ఎవరో ఏదో అంటారని నన్ను నమ్మి నాతో వచ్చిన వారిని బలిపశువుల్ని చేయడం ఇష్టం లేదు. అందువల్ల పార్టీని ప్రారంభించి, రాజకీయాల్లోకి రాలేకపోతున్నా. ఈ విషయాన్ని ఎంతో వేదనతో చెబుతున్నా. దీనిని ప్రకటించేటప్పుడు నేనెంత బాధ పడ్డానో నాకు తెలుసు. నా నిర్ణయం ‘రజనీ మక్కల్‌ మండ్రం’ కార్యకర్తలకు, నేను పార్టీ ప్రారంభిస్తానని ఎదురు చూస్తున్న నా అభిమానులకు, ప్రజలకు నిరాశ కలిగిస్తుందని తెలుసు. నన్ను క్షమించండి. నా మాటకు కట్టుబడి రజనీ మక్కల్‌ మండ్రం వారు గత మూడు సంవత్సరాలుగా ఎంతో క్రమశిక్షణతో, నిజాయతీగా కరోనా కాలంలోనూ నిరాటంకంగా ప్రజలకు సేవ చేశారు. ఆ పుణ్యం ఎప్పటికీ వృధా కాదు. అది మిమ్మల్ని, మీ కుటుంబీకులను కాపాడుతుంది. నవంబర్‌ 30వ తేదీన నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీరంతా ఒకే మాటగా ‘మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు సమ్మతమే’ అని చెప్పిన మాటలు నా జీవితాంతం మర్చిపోలేను. మీరు నామీద పెట్టుకున్న అభిమానానికి, ప్రేమకు, శిరసు వంచి నమస్కరిస్తున్నా.


రజనీ మక్కల్‌ మండ్రం ఎప్పటిలాగే కొనసాగుతుంది. మూడు సంవత్సరాలుగా ఎన్ని విమర్శలు వచ్చినా నిరాటంకంగా నన్ను ఆదరించి, మొదట నా ఆరోగ్యం సంగతి చూసుకోమని అభిమానంతో చెప్పిన తమిళరువి మణియన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక పెద్ద పార్టీలో బాధ్యతలు నిర్వర్తిస్తూ, నేను అడగ్గానే దాని నుంచి వైదొలగి, నాతో కలసి పనిచేసేందుకు వచ్చిన అర్జున మూర్తికి కృతజ్ఞతలు.


రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజలకు ఏం చేయగలనో ఆ మేరకు సేవ చేస్తాను. నేను నిజాలు మాట్లాడేందుకు ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. నిజాన్ని నిర్మొహమాటంగా మాట్లాడడాన్ని ఇష్టపడే వారు, నా ఆరోగ్యంపై శ్రద్ధ వున్న వారు, నన్ను బ్రతికించే నా దేవుళ్లయిన నా అభిమానులు, తమిళనాడు ప్రజలు ఈ నిర్ణయాన్ని ఆమోదించాలని అభ్యర్థిస్తున్నా’ అని రజనీ తన ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.


నిరాశలో అభిమానులు 

రజనీ ప్రకటనతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోగా, ఆయన ప్రత్యర్థుల్లో మాత్రం ఉత్సాహం ఉరకలెత్తుతోంది. రజనీ రాజకీయాల్లోకి వస్తే ఇన్నాళ్లుగా ఆయన్ని నమ్ముకున్న తమకు పదవులు ఇస్తాయని పలువురు అభిమాన సంఘాల నేతలు భావించారు. అంతేగాక వంతులవారీగా రాష్ట్రాన్ని పాలిస్తున్న డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యా మ్నాయంగా ప్రజలు రజనీ పార్టీని ఎన్నుకుంటారని, అది తమకు అధికారం కట్టబెడుతుందని కూడా వారు ఆశించారు. కానీ రజనీ పార్టీ పెట్టడం లేదని తేలడంతో వారంతా తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.


రజనీ రాజకీయాల్లోకి వస్తే ఎవరికి నష్టమన్న దానిపై అన్ని పార్టీలు వేటికవే అంచనాలు వేసుకుంటున్నాయి. రజనీ రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, తద్వారా తాము లబ్ధి పొందుతామని అధికార అన్నాడీఎంకే నేతలు ఇన్నాళ్లూ అంచనాలు వేశారు. అదే సమయంలో తమ ఓటు బ్యాంకు పదిలంగా వుందని, రజనీ రాకతో అన్నాడీఎంకే ఓట్లే చీలుతాయని ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే భావిస్తూ వచ్చింది. అయితే రజనీ అభిమానుల్లో అధికశాతం డీఎంకే శ్రేణులే వున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదెక్కడ తమ పుట్టి ముంచుతుందోనన్న బెంగ కూడా డీఎంకేలో వుంది. ఇప్పుడు రజనీ రాజకీయాల్లోకి రాబోనని చెప్పడంతో ఆ ముప్పు తప్పిపోయినట్టేనని డీఎంకే వర్గాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి.

Updated Date - 2020-12-30T17:45:35+05:30 IST