‘రజనీతో పొత్తు పెట్టుకోను కానీ సినిమాలో నటిస్తా..’
ABN , First Publish Date - 2020-12-11T16:42:35+05:30 IST
‘రజనీతో పొత్తు పెట్టుకోను కానీ సినిమాలో నటిస్తా..’
చెన్నై : అసెంబ్లీ ఎన్నికల్లోగా దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే అళగిరి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ విషయాన్ని అళగిరి సూచన ప్రాయంగా తెలియజేశారు. మదురై అళగర్ కోవిల్‌లో గురువారం ఉదయం జరిగిన తన సన్నిహితుల వివాహవేడుకల్లో అళగిరి పాల్గొన్నారు. ఆ సందర్భంగా మీడియాతో కాసేపు ఆయన ముచ్చటించారు. వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోగా ప్రధానమైన పాత్ర పోషిస్తానని గతంలో తాను చేసిన ప్రకటనను అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారన్నారు.
ప్రధాన పాత్రను పోషించడం అంటే తాను కొత్త పార్టీని ప్రారంభిం చడం, ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం, ప్రచారం సాగించడం తదితర రాజకీయ కార్య కలాపాలను ముమ్మరం చేస్తానని అర్థమని అళగిరి చెప్పారు. రజనీకాంత్ రాజకీయప్రవేశం చేయనుండటంపై ఆయన వ్యాఖ్యానిస్తూ రజనీకి తాను శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పారు. రజనీతో పొత్తుపెట్టుకుంటారా అని ప్రశ్నించినప్పుడు అళగిరి బిగ్గరగా నవ్వుతూ పొత్తు పెట్టుకోను గానీ, సినిమాలో ఆయనతో కలిసి నటించేందుకు తాను రెడీగా ఉన్నానని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలలోపున తగు నిర్ణయం తీసుకుని ప్రకటిస్తానని, ఆలోపున తన మద్దతుదారులతో వీలైనంత త్వరగా సమావేశమై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటానని ఆయన చెప్పారు.
