తలైవర్‌ అడుగు ముందుకా... వెనక్కా!?

ABN , First Publish Date - 2020-12-29T12:39:46+05:30 IST

కొత్త సంవత్సరంలోకి కొంగొత్త ఆశలతో ముందుకెళ్లాలని యావత్ప్రపంచం ఎదురు చూస్తుండగా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు మాత్రం ఈ ఏడాది చివరి రోజున ఆయన పార్టీ ప్రకటన వుంటుందా లేదా అన్న వ్యవహారంపై ఉత్కంఠకు గురవుతున్నారు.

తలైవర్‌ అడుగు ముందుకా... వెనక్కా!?

చెన్నై : కొత్త సంవత్సరంలోకి కొంగొత్త ఆశలతో ముందుకెళ్లాలని యావత్ప్రపంచం ఎదురు చూస్తుండగా.. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులు మాత్రం ఈ ఏడాది చివరి రోజున ఆయన పార్టీ ప్రకటన వుంటుందా లేదా అన్న వ్యవహారంపై ఉత్కంఠకు గురవుతున్నారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన తమ కల నెరవేరుతుందా లేక అది వాయిదా పడుతుందా అన్న సందేహంతో ఆందోళన చెందుతున్నారు. ఈనెల 31న పార్టీ ప్రకటన చేస్తానని రజనీ మూడు వారాల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ లోపు ‘అన్నాత్తే షూటింగ్‌ పూర్తి చేయాలనే ఆలోచనతో ఆయన హైదరాబాద్‌ వెళ్లారు. అనుకోకుండా యూనిట్‌లోని ఎనిమిదిమందికి కరోనా పాజిటివ్‌ రావడంతో షూటింగ్‌ వాయిదా పడింది. షూటింగ్‌ కాగానే చెన్నై వద్దామని ఆయన భావించినప్పటికీ అక్కడే స్వీయ క్వారైంటైన్‌లో వుండిపోయారు. ఈ లోగా ఆయనకు తీవ్ర రక్తపోటు రావడంతో హూటాహూటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వున్న రజనీ.. కొంత కోలుకోవడంతో డిశ్చార్జి అయ్యారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు.


మరో వారం విశ్రాంతి అవసరం

అనారోగ్యం నుంచి రజనీ కోలుకున్నప్పటికీ ఆయనకు మరో వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు స్పష్టం చేశారు. ఆయనకు 2017లో మూత్రపిండ మార్పిడి జరిగిన విషయం తెలిసిందే. ఏడుపదుల రజనీ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యంపై తగిన జాగ్రత్తలు వహిస్తున్నారు. బహిరంగ వేదికలపై జరిగే కార్యక్రమాలను కూడా తగ్గించారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అన్నాత్తే షూటింగ్‌లో పాల్గొని అనారోగ్యం బారిన పడ్డారు. అక్కడ వైద్యులు పూర్తి పరీక్షలు చేశారు. రజనీ వయసురీత్యా, ఆయన మూత్రపిండ సమస్యల కారణంగా ఆయన మరికొంత కాలం పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. శారీరక శ్రమను, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని, వైద్యుల పర్యవేక్షణలోనే వుండాలని కూడా హెచ్చరించారు.


పార్టీ ప్రకటన వుంటుందా?

వైద్యుల సూచనల నేపథ్యంలో రజనీ పార్టీ ప్రకటన చేస్తారా లేదా అన్నదానిపై అభి మానుల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆయన ఖచ్చితంగా  పార్టీ ప్రకటన చేస్తారని రజనీ మక్కల్‌ మండ్రం నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఆ ప్రకటన చాలా సింపుల్‌గా వుంటుందని వారు వివరించారు.దీనిపై పార్టీ నిర్వాహకులు అర్జున్‌ మూర్తి,తమిళురివిమణియన్‌ ఇప్పటికే రజనీతో భేటీ అయి చర్చించినట్టు సమాచా రం. ఎట్టి పరిస్థితుల్లోనూ రజనీ పార్టీ ప్రకటన చేస్తారని, అనుకున్నట్టుగానే ఈనెల 31వ తేదీన ఆ ప్రకటన వుంటుందని మండ్రం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.అయితే బహిరంగ వేదిక పై నుంచి కాకుండా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ, సామాజిక మాధ్యమాల ద్వారా గానీ ఆ ప్రకటన చేస్తారని ఆ వర్గాలు వివరిస్తున్నాయి.


ఒంటరి పోటీయే?

ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే రజనీ ప్రకటించినప్పటికీ.. ఈ వ్యవహారంపై అభిమానుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. అటు బీజేపీ వ్యూహాలు, ఇటు కమల్‌ ప్రకటనల నేపథ్యంలో రజనీ ‘ఒంటరి’ నిర్ణయంపై ఊహాగానాలు రేగుతున్నాయి. అయితే మొత్తం నియోజక వర్గాల్లో తమ పార్టీయే పోటీ చేస్తుందని రజనీ సన్నిహితుడిగా పేరుపొందిన తమిళురవిమణియన్‌ ఓ చానల్‌కు తెలిపారు. ముందస్తు ప్రణాళిక మేరకు పార్టీ వుంటుందని, మొత్తం 234 నియోజకవర్గాల్లో తామే పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-29T12:39:46+05:30 IST