హత్రాస్ బాధిత కుటుంబ పరామర్శకు వెళ్లనున్న రాహుల్, ప్రియాంక

ABN , First Publish Date - 2020-10-03T16:56:49+05:30 IST

హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని రాహుల్, ప్రియాంక మరోసారి నిర్ణయించుకున్నారు.

హత్రాస్ బాధిత కుటుంబ పరామర్శకు వెళ్లనున్న రాహుల్, ప్రియాంక

న్యూఢిల్లీ : హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని రాహుల్, ప్రియాంక మరోసారి నిర్ణయించుకున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ ఎంపీలు కూడా పరామర్శకు వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయల్దేరతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం కూడా హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాహుల్, ప్రియాంక బయల్దేరారు. అయితే నోయిడా సమీపంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో రాహుల్‌కు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ ఘర్షణలో రాహుల్ కిందపడిపోయారు.
తనపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని, కిందకు తోసేశారని రాహుల్ ఆరోపించారు. ఈ ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రాహుల్ తిరిగి ఢిల్లీకి పయనమయ్యారు. ‘‘రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు మధ్యాహ్నం హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని నిర్ణయించుకున్నాం.’’ అని ఓ ఎంపీ ప్రకటించారు. అయితే సిట్ దర్యాప్తు బృందం విచారణ పూర్తయ్యే వరకూ గ్రామంలోకి మీడియాతో పాటు నేతలను కూడా అనుమతించేది లేదని పోలీసులు తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి కాంగ్రెస్ బృందాన్ని అదుపులోకి తీసుకుంటారా? లేక బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి అనుమతినిస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

Updated Date - 2020-10-03T16:56:49+05:30 IST