ఫేస్‌బుక్, వాట్సాప్ బీజేపీ అదుపులో..: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2020-08-16T23:43:59+05:30 IST

వాల్ స్ట్రీట్ జర్నల్‌లో సంచలనాత్మక కథనం ప్రచురితమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, హిందూవాదానికి అనుగుణంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది

ఫేస్‌బుక్, వాట్సాప్ బీజేపీ అదుపులో..: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌.. అధికార పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ అనే పత్రిక ప్రచురించిన కథనంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, విధ్వేష ప్రసంగాలను బీజేపీ ప్రచారం చేస్తోందని అయినప్పటికీ వారిపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు.


తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేసిన రాహుల్ గాంధీ ‘‘ఫేస్‌బుక్, వాట్సాప్‌లను బీజేపీ-ఆర్ఎస్ఎస్ అదుపు చేస్తున్నాయ. ఈ మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, ధ్వేషాన్ని వ్యాప్తి చేసి ఓటర్లను మభ్యపెడుతున్నారు. అమెరికన్ మీడియా ఈ నిజాన్ని బయటపెట్టింది’’ అని రాసుకొచ్చారు.


వాల్ స్ట్రీట్ జర్నల్‌లో సంచలనాత్మక కథనం ప్రచురితమైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, హిందూవాదానికి అనుగుణంగా ఫేస్‌బుక్ వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పుకొచ్చింది. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్లో కొన్నింటిని ఆ కథనంలో ప్రస్తావించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల్ని కథనం మొదట్లోనే రాసుకొచ్చారు.


విధ్వేష ప్రసంగాలపై కొద్ది రోజుల క్రితం ఫేస్‌బుక్ ఉద్యోగులతో అధినేత మార్క్ జూకర్ బర్గ్ చర్చించారు. ఈ కంటెంట్‌పై జాగ్రత్తగా వ్యవహరించాలని ఉద్యోగులకు సూచించారు. అయితే ఇండియాలో బీజేపీ నుంచి వస్తున్న విధ్వేష కంటెంట్ విషయంలో ఫేస్‌బుక్ చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో ప్రధానంగా చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-08-16T23:43:59+05:30 IST