సైనికుల ప్రాణ త్యాగాలు మాటలకు అందనంత బాధాకరం : రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2020-06-17T02:34:27+05:30 IST
వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్-చైనా దళాల

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వద్ద గాల్వన్ లోయలో సోమవారం రాత్రి భారత్-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన సైనికాధికారి, సైనికుల కుటుంబాలకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆత్మీయులను కోల్పోయి, విషాదంతో గడుపుతున్న ఈ సంక్లిష్ట సమయంతో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
సోమవారం రాత్రి లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత దళాలపై చైనా సైనికుల విచక్షణారహితంగా దాడి చేశారు. దీనిపై భారత సైన్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. గాల్వన్ లోయలో ఘర్షణ తీవ్రతను తగ్గించే ప్రక్రియ జరుగుతుండగా, సోమవారం రాత్రి హింసాత్మక ఘర్షణ జరిగినట్లు తెలిపింది. ప్రాణాలు కోల్పోయినవారిలో చైనా, భారత్ సైనికులు ఉన్నట్లు తెలిపింది. భారత సైన్యం ఓ అధికారిని, ఇద్దరు సైనికులను కోల్పోయిందని పేర్కొంది.
రాహుల్ గాంధీ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మన దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అధికారులు, జవాన్ల పట్ల నేను అనుభవిస్తున్న బాధను మాటలు వర్ణించజాలవు. వారి ఆత్మీయులందరికీ నా ప్రగాఢ సానుభూతి. ఈ కష్ట కాలంలో మీకు అండగా ఉంటాం’’ అని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, గాల్వన్ లోయలో భారత్ సైనికులపై చైనా సైనికులు జరిపిన దాడిలో అమరులైనవారిలో ఓ తెలుగు బిడ్డ ఉన్నారు. ఆయన పేరు కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు. ఆయన తల్లిదండ్రులు సూర్యాపేట పట్టణంలోని విద్యా నగర్‌లో నివసిస్తున్నారు. ఆయన భార్యాబిడ్డలు ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన తల్లి మంజుల మాట్లాడుతూ తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం తనకు గర్వకారణమని తెలిపారు. అయితే ఓ బిడ్డకు తల్లిగా ఆమె సహజసిద్ధమైన ఆవేదన వ్యక్తం చేశారు.