హాట్‌స్పాట్‌లను ఐసోలేట్ చేసి.. వ్యాపారాలకు అనుమతించండి: రాహుల్

ABN , First Publish Date - 2020-04-14T21:26:24+05:30 IST

దేశంలోని కరోనా వైరస్ హాట్‌స్పాట్లను ఐసోలేట్ చేసి, మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు పునఃప్రారంభించేందుకు ..

హాట్‌స్పాట్‌లను ఐసోలేట్ చేసి.. వ్యాపారాలకు అనుమతించండి: రాహుల్

న్యూఢిల్లీ: దేశంలోని కరోనా వైరస్ హాట్‌స్పాట్లను ఐసోలేట్ చేసి, మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు పునఃప్రారంభించేందుకు అనుమతించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రానికి సూచించారు. ఏకమొత్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ఆయన కేంద్రంపై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను వచ్చే నెల 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇవాళ ట్విటర్ వేదికగా రాహుల్ స్పందించారు. ‘‘ఏకమొత్తంగా లాక్‌డౌన్ విధించడం వల్ల కోట్లాది మంది రైతులు, వలస కార్మికులు, దినసరి కూలీలు, వ్యాపారులు చెప్పలేనన్ని బాధలు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి దీనికి ఓ మార్పు చేయాల్సిన అవసరం ఉంది. సామూహిక పరీక్షలు నిర్వహించి వైరస్ హాట్‌స్పాట్లను ఐసొలేట్ చేయడం, మిగతా ప్రాంతాల్లో వ్యాపారాలు తెరుచుకునేందుకు అనుమతించడం వంటి మార్పులు చేయాలి..’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.


కాగా లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రం వ్యూహం ఏమిటో చెప్పాలని కాంగ్రెస్ పార్టీ  డిమాండ్ చేసింది. ప్రజలకు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడంపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో వెల్లడించాలని పేర్కొంది. కాగా దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలంటూ నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పేదలకు ఉచిత రేషన్ అందించడంతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి వ్యాపార సంస్థలకు ప్రోత్సాహక ప్యాకేజీ ప్రకటించాలని ఆయన కేంద్రానికి సూచించారు. 

Updated Date - 2020-04-14T21:26:24+05:30 IST