రైతు చట్టాల నిరసనల్లో మృతులకు పంజాబ్ అసెంబ్లీ నివాళి

ABN , First Publish Date - 2020-10-19T22:50:16+05:30 IST

పంజాబ్ రాష్ట్ర 15వ విధాన సభ 13వ ప్రత్యేక సమావేశం సోమవారం..

రైతు చట్టాల నిరసనల్లో మృతులకు పంజాబ్ అసెంబ్లీ నివాళి

ఛండీగఢ్: పంజాబ్ రాష్ట్ర 15వ విధాన సభ 13వ ప్రత్యేక సమావేశం సోమవారం ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని సభ తొలుత నివాళులర్పించింది. దేశ స్వాతంత్ర్య పోరాటంలో అసువులు బాసిన సమర యోధులు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు, అమర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సభలో సభ్యులంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.


ఇటీవల కాలంలో అమరులైన లాన్స్ నాయక్ కర్నైల్ సింగ్, పంజాబీ రచయిత కుల్‌దీప్ సింగ్ ధీర్, పాటియాల పంజాబి యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ ఎస్.జోగిందర్ సింగ్, ప్రముఖ మ్యుజిషియన్ ఎస్.కేసర్ సింగ్ నరూల , తదతరులకు సభ నివాళులర్పించినట్టు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. స్వాతంత్ర్య పోరాటంలో అసమాన సేవలందించిన మహిందర్ సింగ్, సర్దార్ సింగ్, రాయ్ సింగ్ పతంగ, హేమరాజ్ మిట్టల్‌కు, ఇటీవల కన్నుమూసిని ఎమ్మెల్యేలకు కూడా సభ నివాళులర్పించింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ స్పీకర్ ప్రవేశపెట్టిన తీర్మానానికి మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది.


దీనికి ముందు, అమరీందర్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ, ప్రత్యేక విధానసభ సమావేశం ప్రారంభం కాగానే సౌర్య చక్ర అవార్డు గ్రహీత బల్వందర్ సింగ్, ఇతర అమరవీరులు, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసన తెలుపుతూ దురదృష్టవశాత్తూ మృతిచెందిన రైతులకు సభ సంతాపం తెలుపుతుందని పేర్కొన్నారు.

Updated Date - 2020-10-19T22:50:16+05:30 IST