రైతుల ఆందోళనకు మద్దతుగా పంజాబ్ లాయర్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-28T01:55:56+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆదివారంనాడు విషాద ఘటన..

రైతుల ఆందోళనకు మద్దతుగా పంజాబ్ లాయర్ ఆత్మహత్య

ఝజ్జర్: నూతన వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనల నేపథ్యంలో ఆదివారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. రైతులు ఆందోళన సాగిస్తున్న తిక్రి సరిహద్దుకు కొద్ది కిలోమీటర్ల దూరంలో పంజాబ్‌కు చెందిన ఒక లాయర్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లాలోని జలాలాబాద్‌కు చెందిన అమర్‌జిత్ సింగ్‌గా గుర్తించారు. రోహ్‌టక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పీజీఐఎంఎస్)కు హుటాహుటిన అమర్‌జిత్ సింగ్‌ను తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్నుమూసినట్టు పోలీసులు తెలిపారు.


సూసైడ్ నోట్...

ఆత్మహత్యా స్థలి వద్ద సూసైడ్ నోట్‌ను పోలీసులు కనుగొన్నారు. రైతుల ఆందోళనకు మద్దతుగానే తాను ప్రాణత్యాగం చేస్తున్నానని, తన ప్రాణత్యాగంతోనైనా ప్రజావాణిని ప్రభుత్వం తప్పనిసరిగా వింటుందని ఆశిస్తున్నానని అందులో అమర్ జిత్ పేర్కొన్నాడు. ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు 'నల్ల' చట్టాలతో రైతులు, కూలీలు వంటి సాధారణ ప్రజానీకమంతా వంచనకు గురయ్యామనే భావనతో ఉన్నారని, తమ జీవితంలో ఇక గడ్డు రోజులు తప్పవనే అభిప్రాయానికి వచ్చారని సింగ్ వాపోయాడు. కాగా, డిసెంబర్ 18న రాసినట్టు ఉన్న ఈ సూసైట్ నోట్‌ ప్రామాణికతను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం ఇచ్చినందున వారు రాగానే వాంగ్మూలం తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2020-12-28T01:55:56+05:30 IST