కుటుంబం బయటి వ్యక్తి అధ్యక్షుడైనా సమ్మతమే
ABN , First Publish Date - 2020-08-20T07:02:37+05:30 IST
గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావాలన్న ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అభిప్రాయంతో ప్రియాంక వాద్రా ఏకీభవించారు...

- రాహుల్ అభిప్రాయంతో ఏకీభవించిన ప్రియాంక
న్యూఢిల్లీ, ఆగస్టు 19: గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు కావాలన్న ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ అభిప్రాయంతో ప్రియాంక వాద్రా ఏకీభవించారు. గాంధీ కుటుంబికులే కాకుండా ఇంకెవరైనా పార్టీ పగ్గాలు చేపడితే తనకు అభ్యంతరం లేదన్నారు. ఈ మేరకు ఆమె అన్నట్లు ‘‘ఇండియా టుమారో: కాన్వర్జేషన్ విత్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పొలిటికల్ లీడర్స్’’ అనే పుస్తకం వెల్లడించింది. అమెరికా విద్యావేత్తలు ప్రదీప్ చిబ్బర్, హర్ష్ షా ఈ పుస్తకాన్ని రాశారు. నిరుడు జూలైలో వీరిద్దరూ ప్రియాంక, రాహుల్‌ను ఏకకాలంలో ఇంటర్వ్యూ చేశారు. కాంగ్రెస్ పార్టీ నూతన పంథాలో వెళ్లాలని కూడా ఆమె వ్యాఖ్యానించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రియాంక వ్యాఖ్యలను పార్టీ నేతలు మరో రకంగా చూస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు ఏడాది క్రితం నాటివని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా అన్నారు.