యోగి ఆదిత్యనాథ్‌కు ప్రియాంక గాంధీ లేఖ
ABN , First Publish Date - 2020-03-28T00:16:52+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో సహకరించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. శుక్రవారం ఆమె ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రాసిన లేఖలో కోవిడ్-19పై యుద్ధంలో ప్రభుత్వానికి తమ పార్టీ సహకరిస్తుందని తెలిపారు.
దేశంలో అత్యవసర పరిస్థితి ఉత్పన్నమైందని, ఈ సమయంలో ప్రభుత్వానికి సహకరించేందుకు తమ పార్టీ సంపూర్ణంగా సిద్ధంగా ఉందని ప్రియాంక పేర్కొన్నారు. ఇది విభేదాలకు అతీతంగా పని చేయవలసిన సమయమని, దేశం కోసం కలిసికట్టుగా పోరాడవలసిన సమయమని పేర్కొన్నారు. నిరుపేదలు, అణగారిన వర్గాలవారి సమస్యలు మరింత అధ్వాన్నంగా మారకుండా చూడాలనే అంశాన్ని మనమంతా దృష్టిలో పెట్టుకోవాలన్నారు.
తాము ఓ స్వచ్ఛంద సేవకుల బృందాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నవారికి హెల్ప్‌లైన్ ఫోన్ నెంబరును కేటాయించామని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించేందుకు ఈ బృందం నిరంతరం సిద్ధంగా ఉంటుందన్నారు. మరింత వేగంగా సహాయ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఈ బృందాల సేవలను ఉపయోగించుకోవాలని కోరారు.
రోజు కూలీలు, వితంతువులు, ఇతరులకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, ఇతర ప్రకటనల ప్రయోజనాలు వారికి సక్రమంగా అందేవిధంగా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రియాంక కోరారు. ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు సజావుగా తమ స్వగ్రామాలకు చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
కోవిడ్-19పై పోరాటంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, నర్సులు, ఆశా వర్కర్లు గొప్ప యోధులని, వారికి కొన్ని చోట్ల సంరక్షణ పరికరాలు అందుబాటులో లేనట్లు వార్తలు వస్తున్నాయని, వారికి రక్షణ పరికరాలను అందించాలని కోరారు. ఈ యోధులకు రక్షణ పరికరాలను అందజేయడం మన ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు.