‘ఒక దేశం-ఒకే ప్రవర్తన’కు ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్

ABN , First Publish Date - 2020-11-27T21:03:27+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి

‘ఒక దేశం-ఒకే ప్రవర్తన’కు ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి స్థానం లేకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బాసటగా నిలిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఒక దేశం-ఒకే ప్రవర్తన’ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘ఢిల్లీ చలో’ కార్యక్రమానికి పంజాబ్ నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్తుండటంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. వాటర్ కెనన్లు, బాష్పవాయు గోళాలను ప్రయోగిస్తూ, రైతులు ఢిల్లీ చేరుకోకుండా నిరోధిస్తున్నారు. 


ప్రియాంక గాంధీ వాద్రా శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘రైతుల గళాలను అణచివేసేందుకు - వారిని నీటిలో తడుపుతున్నారు, వారిని ఆపేందుకు రోడ్లను తవ్వుతున్నారు. ఎంఎస్‌పీని పొందేందుకు చట్టబద్ధమైన హక్కు ఉన్నట్లు ఎక్కడ రాశారో వారికి చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం శ్రద్ధచూపుతున్న ప్రధాన మంత్రి ‘ఒక దేశం-ఒకే ప్రవర్తన’ను అమలు చేయాలి’’ అని కోరారు. 


హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతులు ‘ఢిల్లీ చలో’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వీరిని అడ్డుకునేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. 


ఇదిలావుండగా, నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. దళారీ వ్యవస్థను తొలగించి, రైతులు తమ వ్యవసాయోత్పత్తులను కమర్షియల్ మార్కెట్లలో అమ్ముకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్తోంది. అయితే రైతులు ఈ కొత్త చట్టాల వల్ల ప్రభుత్వం తమ ఉత్పత్తులను ఎంఎస్‌పీకి కొనడం మానేస్తుందని ఆందోళనకు గురవుతున్నారు. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం మాట్లాడుతూ, లోక్‌సభ, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకే ఓటర్ల జాబితా ఉండాలన్నారు. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ జరగవలసిన అవసరం ఉందన్నారు. 


Read more