రైల్వేల ప్రైవేటీకరణ... ‘పుండు మీద కారం’ మాదిరేనా ?

ABN , First Publish Date - 2020-07-05T19:40:03+05:30 IST

మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్ళను నడిపేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ భారతీయ రైల్వే ‘ఆర్‌ఎఫ్‌క్యూ(రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అన్నీ సవ్యంగా జరిగితే మరో మూడేళ్ళలో ప్రైవేటు రైళ్ళు పట్టలెక్కనున్నాయి.

రైల్వేల ప్రైవేటీకరణ... ‘పుండు మీద కారం’ మాదిరేనా ?

న్యూఢిల్లీ : మొదటి దశలో భాగంగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో రైళ్ళను నడిపేందుకు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ భారతీయ రైల్వే ‘ఆర్‌ఎఫ్‌క్యూ(రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్’ ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అన్నీ సవ్యంగా జరిగితే మరో మూడేళ్ళలో ప్రైవేటు రైళ్ళు పట్టలెక్కనున్నాయి.


ఈ ప్రాజెక్టు కింద ప్రైవేటు రంగం నుంచి రైల్వేలోకి రూ.30 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు. ‘ఈ ప్రయత్నంతో రైల్వేలో కొత్త టెక్నాలజీ తీసుకురావడం, మరమ్మతుల ఖర్చు, ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఉద్యోగాలు, భద్రతలను మరింత పెంచడం, ప్రయాణికులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు కల్పించడం లక్ష్యం’ అని రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా... ఈ రైళ్లనన్నింటినీ భారత్‌లోనే తయారు చేయనుండడం విశేషం. అందుకు నిధులు అందించడం, వాటిని నడిపించడం, పర్యవేక్షణ బాధ్యతలను ప్రైవేటు కంపెనీలకు అప్పగించనున్నారు. ఈ ప్రాజెక్టు గడువు 35 ఏళ్లు ఉంటుందని రైల్వే చెబుతోంది. రైళ్ళను నడుపుకున్నందుకుగాను ప్రభుత్వానికి ప్రైవేటు సంస్థలు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. 


కాగా... దేశంలోని రైల్వే నెట్‌వర్కును మొత్తం 12 క్లస్టర్లుగా విభజించారు. వీటిలోని 109 మార్గాల్లో 218 ప్రైవేటు రైళ్లను నడిపించాలనే ప్రతిపాదనలున్నాయి. వీటికి కేవలం గార్డ్, డ్రైవర్‌‌లను మాత్రమే భారతీయ రైల్వే అందించనుంది.


కాగా రైల్వేల ప్రైవేటీకరణపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘ఇది కేవలం ఓ విఫల ప్రయోగం మాదిరిగానే మిగులుతుంది. చివరకు పుండు మీద కారం చల్లినట్లే ఉంటుంది’ అని కొందరు నిపుణులు చెబుతుండగా, ‘రైల్వేల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు సబబే. దీనివల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలందుతాయి. అంతేకాదు... ప్రభుత్వానికి కూడా భారీ స్థాయిలోనే ఆర్ధిక భారం తప్పుతుంది’ అని మరికొందరు చెబుతున్నారు.


అయితే కొన్ని దేశాల్లో రైల్వేల ప్రైవేటీకరణ జరిగిందని, మనదేశంలో కూడా ప్రైవేటీకరణ జరిపేముందు ఆయా దేశాల్లోని రైల్వేల స్థితిగతులను హడావిడిగా కాకుండా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరమెంతైనా ఉందనీ మరికొందరు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఎంటే... రైల్వేల ప్రవేటీకరణతో ప్రయాణికులపై విపరీతమైన భారం పడుతుందని, ఇది అంతిమంగా వారిని రైలు ప్రయాణాలకు దూరం చేస్తుందని, తద్వారా రైల్వే వ్యవస్థ మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదముందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-07-05T19:40:03+05:30 IST