ప్రైవేటు స్కూళ్లు వార్షిక ఫీజు పెంచొద్దు

ABN , First Publish Date - 2020-04-18T07:36:02+05:30 IST

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో ప్రైవేటు పాఠశాలలు వార్షిక ఫీజు హెచ్చింపు నిర్ణయాలను పునఃపరిశీలించాలని

ప్రైవేటు స్కూళ్లు వార్షిక ఫీజు పెంచొద్దు

  • త్రైమాసిక ఫీజు చెల్లింపులో వెసులుబాటు
  • కేంద్ర మంత్రి పోఖ్రియాల్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సమయంలో ప్రైవేటు పాఠశాలలు వార్షిక ఫీజు హెచ్చింపు నిర్ణయాలను పునఃపరిశీలించాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిషాంక్‌ విజ్ఞప్తి చేశారు. అలాగే లాక్‌డౌన్‌ కాలంలో త్రైమాసిక ఫీజు వసూలు నిర్ణయాన్ని కూడా పునఃపరిశీలించాలని ఆయన కోరారు. శుక్రవారం మంత్రి ఈ మేరకు ట్వీట్‌ చేశారు. ‘‘కరోనా వైర్‌సతో దేశమంతా అతలాకుతలమవుతున్న ప్రస్తుత తరుణంలో అనేక ప్రైవేటు పాఠశాలలు వార్షిక ఫీజుని పెంచుతున్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు నాకు తెలిపారు. అంతేకాకుండా మూడు నెలలకు కట్టే ఫీజుని కూడా తక్షణమే చెల్లించాల్సిందిగా పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. కరోనా వైర్‌సపై పోరాటం జరుపుతున్న ఈ సమయంలో పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై కారుణ్యం చూపాలి’’ అని రమేశ్‌ పోఖ్రియాల్‌ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పాఠశాలలు, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ దిశగా కొన్ని రాష్ట్రాలు సా నుకూల నిర్ణయం తీసుకున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. 


ఫీజుల చెల్లింపుపై సమయోచిత నిర్ణయం!

లాక్‌డౌన్‌ కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో సీబీఎ్‌సఈ అనుబంధిత  పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల చెల్లింపు, ఉపాధ్యాయులకు వేతనాల చెల్లింపు అంశాలపై సమగ్రంగా  పరిశీలించి సున్నితంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీబీఎ్‌సఈ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో పాఠశాలలు, విద్యార్థులు అందరి ప్రయోజనాలనూ పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సీబీఎ్‌సఐ సూచించింది. విద్యార్థులు ఫీజులను ఏకమొత్తంగా చెల్లించాల్సిన పరిస్థితి, టీచర్లకు వేతనాల  చెల్లింపు విషయాలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సీబీఎ్‌సఈ విజ్ఞప్తి చేసింది. సీబీఎ్‌సఈ కార్యదర్శి అనురాగ్‌ త్రిపాఠీ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మేరకు లేఖలు రాశారు.

Updated Date - 2020-04-18T07:36:02+05:30 IST