కరచాలనం మానేసి, ‘నమస్తే’ అంటున్న ప్రిన్స్ ఛార్లెస్

ABN , First Publish Date - 2020-03-12T19:35:56+05:30 IST

భారతీయ విజ్ఞానం ప్రపంచవ్యాప్తమవుతోంది. యోగా తర్వాత నమస్కారం ప్రాచుర్యం పొందుతోంది. కరోనా వైరస్ విజృంభణతో కరచాలనం చేయడానికి అందరూ వెనుకాడుతున్నారు.

కరచాలనం మానేసి, ‘నమస్తే’ అంటున్న ప్రిన్స్ ఛార్లెస్

న్యూఢిల్లీ : భారతీయ విజ్ఞానం ప్రపంచవ్యాప్తమవుతోంది. యోగా తర్వాత నమస్కారం ప్రాచుర్యం పొందుతోంది. కరోనా వైరస్ విజృంభణతో కరచాలనం చేయడానికి అందరూ వెనుకాడుతున్నారు. అదేవిధంగా బ్రిటిష్ రాజ వంశీకులు కూడా కరచాలనం మానుకుని, భారతీయ సంప్రదాయమైన నమస్కారంతో అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. 


కరోనా వైరస్ దాడి బ్రిటన్‌లో తీవ్రమైన నేపథ్యంలో వ్యక్తులు ఇతరులతో శారీరకంగా ఏవిధంగానూ సంబంధం పెట్టుకోరాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇతరులను పలుకరించేందుకు కరచాలనం ఇవ్వకుండా సంయమనం పాటించాలని కూడా చెప్తున్నారు. 


బ్రిటిష్ రాజవంశీకులు కూడా ఈ సలహాలను పాటిస్తున్నట్లు చెప్పడానికి బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ప్రిన్స్ ఛార్లెస్ వ్యవహరించిన తీరు నిదర్శనంగా నిలుస్తోంది. 


ప్రిన్స్ ట్రస్టు వార్షికోత్సవాల సందర్భంగా పురస్కారాల ప్రదాన కార్యక్రమం లండన్ పల్లాడియంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను ప్రిన్స్ ఛార్లెస్ ‘నమస్తే’తో పలుకరించారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారు ప్రిన్స్ ఛార్లెస్‌కు కరచాలనం ఇవ్వబోగా, ఆయన అందుకు నిరాకరిస్తూ, నమస్కారం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.


ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కేశవన్ ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. ‘‘నమస్తే. చూడండి, ఈ విధంగా చేయాలని ప్రపంచానికి భారతీయులం చాలా చాలా సంవత్సరాల క్రితం చెప్పాం. ‘నమస్తే ఏ విధంగా చేయాలో నేర్పించే తరగతి ఇది’.’’ అని పేర్కొన్నారు. 


 12 సెకండ్ల నిడివిగల ఈ వీడియోలో కనిపిస్తున్నదేమిటంటే... ప్రిన్స్ ఛార్లెస్ లండన్ పల్లాడియంకు తన కారులో వచ్చారు. కారు నుంచి దిగిన తర్వాత తన ఎదురుగా ఉన్నవారితో కరచాలనం చేయబోయారు. కానీ అకస్మాత్తుగా ఆ చర్యను మానుకుని, రెండు చేతులు జోడించి, వారికి నమస్కారం పెట్టారు. దీంతో ఆయన ఎదురుగా కరచాలనం చేయబోయిన వ్యక్తులు నవ్వుల్లో మునిగి తేలారు. అనంతరం ప్రిన్స్ ఛార్లెస్ ఇతరులను కూడా నమస్కారం పెడుతూ పలుకరించారు. 


Updated Date - 2020-03-12T19:35:56+05:30 IST