జమిలి మంచిదే!

ABN , First Publish Date - 2020-11-27T07:10:48+05:30 IST

జమిలి ఎన్నికల ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రస్తావించారు. లోక్‌సభ, విధానసభల నుంచి మునిసిపల్‌, పంచాయతీల వరకూ ఒకేసారి ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగాలని, అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల

జమిలి మంచిదే!

’ఒక దేశం- ఒకే ఎన్నిక’ ప్రస్తుతం అవసరం.. అన్నింటికీ ఒకే ఓటర్ల జాబితా ఉండాలి

దీనిపై లోతైన చర్చ జరగాలి.. సభాపతుల సదస్సులో ప్రధాని మోదీ పిలుపు


న్యూఢిల్లీ, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జమిలి ఎన్నికల ప్రతిపాదనను ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రస్తావించారు. లోక్‌సభ, విధానసభల నుంచి మునిసిపల్‌, పంచాయతీల వరకూ ఒకేసారి ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగాలని, అన్ని ఎన్నికలకూ ఒకే ఓటర్ల జాబితాను ఉపయోగించుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన 80వ అఖిల భారత సభాపతుల సదస్సు ముగింపు సమావేశంలో గురువారం ఆయన వీడియో లింక్‌ ద్వారా మాట్లాడారు. ‘‘దేశంలో ప్రతీచోటా కొద్ది నెలలకోసారి ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. వీటి వల్ల అభివృద్ధి పనులపై గట్టి ప్రభావం పడుతోంది. ఖర్చూ ఎక్కువ. సమయమూ వృథా. ఇది అందరికీ తెలిసినదే. అందుచేత ‘ఒక దేశం- ఒకే ఎన్నిక’ అన్నది ప్రస్తుతం దేశానికి అవసరం. ఈ విషయంపై లోతైన అధ్యయనం జరగాలి. లోక్‌సభకు వేరుగా- స్థానిక ఎన్నికలకు వేరుగా ఓటర్ల జాబితా తయారుచేయడం వనరులను వృథా చేయడమే.. ఒకే జాబితాతో ఎన్నికలు జరపాలి’’ అని ఆయన సూచించారు. ‘‘జాతీయ ప్రాధాన్యాంశాలను, ప్రజా సంక్షేమాన్ని రాజకీయ వ్యవహారాలు గనక టేకోవర్‌ చేస్తే దేశం దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్న సంగతి అందరూ గ్రహించాలి’’ అని మోదీ పేర్కొన్నారు.


ప్రధాని  జమిలి ఎన్నికల అవసరాన్ని నేరుగా ప్రస్తావించడం ఇది మూడు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. స్వాతంత్య్ర దిన ప్రసంగంలో కూడా ఆయన దీనిని లేవనెత్తారు. ’’జీఎస్టీ ద్వారా ఒక దేశం-ఒకే  పన్ను విధానాన్ని, విద్యుత్‌ రంగంలో ఒక దేశం-ఒకే గ్రిడ్‌ను, ఎక్కడికి వెళ్లినా ఒకే గుర్తింపు కార్డుండేలా- ఒక దేశం-ఒకే కార్డును...ఇప్పటికే సాధించాం. ఇక ఒకదేశం- ఒకేసారి ఎన్నికలను కూడా మొదలెట్టాలి. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలి’’ అని ఆనాడు ఆయన సూచించారు. ఆయన తన తొలి ఐదేళ్ల పాలనలో కూడా దీన్ని ముందుకు తెచ్చారు. దేశం ఎల్లకాలం ఎలక్షన్లతోనే గడిపేయరాదని ఆయన రెండుమూడు సందర్భాల్లో అన్నారు. వనరుల ఆదా కోసం, పరిపాలనపై మరింత దృష్టి పెట్టడం కోసం ఇది జరగాలంటూ అటు బీజేపీ కూడా జమిలి ప్రతిపాదనను సమర్థిస్తూ వచ్చింది.


అయితే విపక్షాలన్నీ దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఓ పార్లమెంటరీ స్థాయీసంఘం, నీతి ఆయోగ్‌, ఎలక్షన్‌ కమిషన్‌, లా కమిషన్‌... అన్నీ జమిలిపై అధ్యయనం చేశాయి. ఒకేసారి లోక్‌సభకు, అసెంబ్లీలకు ఎన్నికలు జరపొచ్చని, అయితే ఇందుకు కొన్ని రాజ్యాంగ సవరణలు అవసరమవుతాయని లా కమిషన్‌ తన సిఫారసులో పేర్కొంది. 2024 నుంచి జమిలిని దశలవారీగా జరపాలని నీతి ఆయోగ్‌ సూచించింది. ఎలక్షన్‌ కమిషన్‌ మాత్రం దీనిపై పార్టీల ఏకాభిప్రాయం అవసరమని, అది జరగనంతకాలం దీన్ని చేపట్టలేమని అభిప్రాయపడింది. దీనిపై కమిషన్‌ కొన్ని సమావేశాలు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది.


ఒక దేశం-ఒకే కార్డును.. ఇప్పటికే సాధించాం. ఇక ఒకదేశం- ఒకేసారి ఎన్నికలను కూడా మొదలుపెట్టాలి. దీనిపై ప్రజాస్వామ్యబద్ధంగా చర్చ జరగాలి.

- ప్రధాని నరేంద్ర మోదీ

Read more