ఆ అర్చకులను ఇక దేవుడే కాపాడాలి

ABN , First Publish Date - 2020-04-12T16:53:35+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది రెక్కాడితే కానీ

ఆ అర్చకులను ఇక దేవుడే కాపాడాలి

హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోడానికి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది రెక్కాడితే కానీ డొక్కాడని కూలీలు, కార్మికుల జీవితాలు దుర్భరమయ్యాయి. రోజూ పనిచేస్తే గానీ జేబులు నిండని జీవితాలు మన దేశంలో కోకొల్లలు. అదే కోవలోకి అర్చక వృత్తుల వారూ చేరిపోయారు. ప్రతి రోజూ దేవాలయానికి వచ్చే భక్తులిచ్చే దక్షిణలు, స్మార వృత్తి చేసుకుంటూ ఏ రోజుకారోజే తమ జీవనాన్ని కొనసాగించే అర్చకులు మన దేశంలో చాలా మందే ఉన్నారు. చిన్న చిన్న దేవాలయాలు, అంతగా ఆదాయం రాని దేవాలయాల అర్చకుల పరిస్థితి మరింత దుర్భరమై కూర్చుంది.


వారందరి జీవితాలపై కరోనా మహమ్మారి వారి డొక్కలో తన్నినంత పని చేసింది. దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ దేవాలయాలకు భక్తులు రావడం తగ్గిపోయింది... శుభ కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. దీంతో ఏ రోజుకి ఆ రోజు వచ్చే సంభావనల మీద బతికే అర్చకుల మొహంలో కళ తప్పిపోయింది. వారి కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోంది. శుభ కార్యక్రమాలు ఎలాగూ లేవు... కనీసం శ్రాద్ధ కర్మల మీదనైనా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిద్దామంటే... లాక్‌డౌన్ కారణంగా శ్రాద్ధ కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగడం లేదని అర్చకులు వాపోతున్నారు.


‘‘లాక్‌డౌన్ విధిస్తున్నాము అని దేశ ప్రధాని ప్రకటించగానే నా మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా కష్టపడుతూ రోజుని వెళ్లదీయాల్సిన సంకట స్థితిలోకి నెట్టివేయబడ్డాం’’ అని అగ్నిహోత్ర శర్మ అనే అర్చకుడు వాపోయాడంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.  మార్చి, ఏప్రిల్ మాసాలు మాకు కడుపు నింపే రోజులు. పెళ్లిల్లు, శుభ కార్యాలతో మేము బిజీగా ఉంటాం. ఈ కరోనా మహమ్మారి కారణంగా దేవాలయాలు మూసేశారు. ఇంట్లో జరుపుకునే శుభకార్యాలను కూడా గృహస్థులు వాయిదా వేసుకున్నారు.’’ అని మరో అర్చకుడు గౌతమ్ చక్రవర్తి వాపోయారు.


కొన్ని కొన్ని సంస్కారాలకు ముగ్గురు లేదా నలుగురు అర్చకులు అవసరం అవుతారు. ఒకరినొకరు సమన్వయం చేసుకుంటే తప్ప తత్సంబంధిత క్రతువును చేయించలేరు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఒక్క అర్చకుడే చేయాలని అనుకున్నా.. .కార్యక్రమాలు లేవని, ఒక్కరే కార్యక్రమాలను నిర్వహించడం అసాధ్యమని, అలా కూడా కరోనా మమ్ములను కాటేసిందని వాపోతున్నారు. మరో అర్చకుడు మాట్లాడుతూ... ఇన్నాళ్లూ తాను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, పౌరోహితం వైపు మళ్లానని, తన కుమారుడు బీటెక్ చదువుకుంటున్నాడని తెలుపుతూ... ఏ కార్యక్రమాలూ లేకపోవడంతో తాము పస్తులుండిపోతున్నామని తీవ్ర బాధను వెళ్లగక్కారు.


మరికొందరైతే కార్యాలు నిర్వహించడానికి తమ తమ ఇళ్లకు అనుమతించడం లేదని, తమ ఇంట్లోనే కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించడమని అంటున్నారని తెలిపారు. అయితే ఈ కార్యక్రమం చేసినందుకే కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయని తెలిపారు. తాము ఎవర్నీ నిందించడం లేదని, ప్రజల భయాలను తాము అర్థం చేసుకొని మెసులుతున్నామని అన్నారు. ఇందులో కొందరు అర్చకులు మాత్రం కేవలం పౌరోహితం పైనే  ఆధారపడకుండా... జ్యోతిశ్శాస్త్రం,. ఇతరత్రా కార్యక్రమాలూ చేసేవారికి కొంతలో కొంత వెసులుబాటు కలుగుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.


జ్యోతిషం... ఇతర కార్యక్రమాల ద్వారా వచ్చిన సంపాదనను లాక్‌డౌన్ సమయంలో పొదుపుగా వినియోగించుకుంటున్నామని, అనుకోకుండా ఆరోగ్య సమస్యలు గానీ, అత్యవసర అవసరాలు గానీ కలిగితే పరిస్థితి ఏంటని వాపోయారు. దేశవ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద ఆలయాలు లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులను దేవాలయాల్లోకి అనుమతించడం లేదు. అర్చకులు మాత్రమే రోజువారీ పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో కేవలం అర్చకత్వం మీదే ఆధారపడి జీవిస్తున్న బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడిపోయాయి.


అయితే కేవలం అర్చకత్వం మీదే బతుకును వెళ్లదీస్తున్న కుటుంబాలను ఆయా స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పథకాలతో పాటు అనేక స్థానిక బ్రాహ్మణ సంఘాలు కూడా వారికి అవసరమైన నిత్యావసర వస్తువులు అందిస్తూ చేదోడు వాదోడుగా నిలుస్తున్నాయి. దీంతో కొంతలో కొంత తాము ఊపిరి పీల్చుకున్నామని అన్నారు.  

Updated Date - 2020-04-12T16:53:35+05:30 IST