నేపాల్‌కు ప్రతినిధులను పంపిన చైనా అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-12-26T21:23:55+05:30 IST

నేపాల్ పార్లమెంట్ ను రద్దైన తర్వాతి పరిణామాలను చైనా అత్యంత నిశితంగా గమనిస్తోంది. కేపీ ఓలీ శర్మ, ప్రచండ మధ్య ముదిరిన

నేపాల్‌కు ప్రతినిధులను పంపిన చైనా అధ్యక్షుడు

న్యూఢిల్లీ : నేపాల్ పార్లమెంట్ ను రద్దైన తర్వాతి పరిణామాలను చైనా అత్యంత నిశితంగా గమనిస్తోంది. కేపీ ఓలీ శర్మ, ప్రచండ మధ్య ముదిరిన విభేదాలు కాస్తా... చీలిక వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో చీలికలు రాకుండా ఉండేందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నేపాల్‌కు ఓ టీమ్‌ను పంపించినట్లు సమాచారం. ఒకవేళ కమ్యూనిస్టు పార్టీలు చీలిక దిశగా వెళితే మాత్రం... దానిని నివారించే బాధ్యతను జిన్‌పింగ్ ఆ టీమ్‌కు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. చైనా రాయబారి హావో యాంకీ రాయబారం విఫలం కావడంతోనే జిన్‌పింగ్ ఈ బృందాన్ని ఎంపిక చేసి, నేపాల్‌కు పంపించారని ఓ వర్గం పేర్కొంటోంది. చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, మంత్రి గువో యేచౌ సారథ్యంలో ఈ టీమ్ నాలుగు రోజుల పాటు ఖాట్మాండులోనే బస చేయనుంది. అయితే ఇప్పటికే చైనా రాయబారి హావో యాంకీ అటు కేపీ శర్మ ఓలీ, ప్రచండతో భేటీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.


అయితే హావో యాంకీ ప్రతిపాదనను ప్రధాని శర్మ నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. చైనా రాయబారి హావో యాంకీతో భేటీ కావడానికే తిరస్కరించిన ఓలీ... చైనా అధ్యక్షుడు పంపిన ప్రతినిధులతో భేటీ అవుతారా? అన్నది అనుమానమే అని ఆయన వర్గం పేర్కొంటోంది. తమ అంతర్గత వ్యవహారాల్లో చైనా జోక్యం చేసుకుంటే కుదరదని ఇప్పటికే ఓలీ తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. అయితే చైనా రాయబారి ఓలీ క్యాంపు నేతలతో టచ్‌లోనే ఉన్నారని, కానీ... ఓలీ మాత్రం టచ్‌లోకి రావడం లేదని తెలుస్తోంది. ఓలీ ప్రత్యర్థి ప్రచండతో మాత్రం పలు దఫాలుగా చర్చలు జరిపింది. 


పార్లమెంట్‌ను రద్దు చేయాలంటూ ఓలీ నేతృత్వంలోని మంత్రివర్గం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. దీంతో రాష్ట్రపతి విద్యాదేవీ భండారీ పార్లమెంట్‌ను రద్దు చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే.  2018 లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు) విలీనమైన తరువాత కేపీ ఓలీని ప్రధానిగా ఎన్నుకున్నారు. మావోయిస్టు నేత ప్రచండ సీపీఎన్ పార్టీ కో చైర్మన్ అయ్యారు. కొన్ని రోజుల తర్వాత వారిద్దరి మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-26T21:23:55+05:30 IST