రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రవేశిక పఠనం
ABN , First Publish Date - 2020-11-26T20:43:11+05:30 IST
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

న్యూఢిల్లీ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను చదివించారు. రాష్ట్రపతి భవనంలో ఆయన రాజ్యాంగ ప్రవేశికను చదువుతుండగా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. గుజరాత్‌లోని కేవడియాలో జరుగుతున్న 80వ ఆలిండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్నవారితోపాటు దేశవ్యాప్తంగా సామూహికంగా రాజ్యాంగ ప్రవేశికను పఠించారు.
భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిన రోజు (నవంబరు 26)ను రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజును జాతీయ న్యాయ దినోత్సవంగా కూడా పేర్కొంటారు. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ 1949 నవంబరు 26న ఆమోదించింది. ఇది 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవాన్ని మొదట 2015లో నిర్వహించారు. రాజ్యాంగ రచన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు నివాళిగా ఈ వేడుకను నిర్వహించాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది. 2 సంవత్సరాల 11 నెలల 17 రోజుల్లో మన దేశ రాజ్యాంగం రూపొందింది. మన దేశం సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక, గణతంత్ర దేశమని రాజ్యాంగం పేర్కొంది. ప్రజలకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛలను హామీ ఇచ్చింది. ప్రజల్లో సోదరభావాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ప్రపంచంలో సుదీర్ఘ రాజ్యాంగంగా పేరు పొందింది.