ఇక.. లక్ష్యం దిశగా దూసుకుపో..

ABN , First Publish Date - 2020-08-01T08:33:40+05:30 IST

చాలా మంది పిల్లలకు నైపుణ్యం ఉన్నా.. ఆర్థిక నైరాశ్యం వెంటాడుతూ ఉంటుంది.

ఇక.. లక్ష్యం దిశగా దూసుకుపో..

  • బాలుడికి రేసింగ్‌ సైకిల్‌ బహూకరించిన రాష్ట్రపతి


న్యూఢిల్లీ, జూలై 31: చాలా మంది పిల్లలకు నైపుణ్యం ఉన్నా.. ఆర్థిక నైరాశ్యం వెంటాడుతూ ఉంటుంది. కొందరు దానిలో కొట్టుమిట్టాడుతుంటే.. మరి కొందరు ఒడుదుడుకులను ఈదుతూనే జీవితాశయంపై గురిపెడతారు. ఆ పట్టుదలకు ఏదో రకంగా కాస్త చేయూత అందితే.. ఇక మిగిలున్నది లక్ష్యమే కదా!. బిహార్‌లోని మధుబనికి చెందిన రియాజ్‌ ఢిల్లీలోని సర్వోదయ బాల విద్యాలయలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సైక్లింగ్‌లో ప్రపంచ స్థాయికి ఎదగాలన్నది అతడి జీవితాశయం. ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఒక హో టల్‌లో గిన్నెలు కడిగే పని చేసేవాడు. మిగిలిన కొద్ది సమయంలోనే ప్రమోద్‌ శర్మ అనే కోచ్‌ వద్ద తర్ఫీదు పొందేవాడు. దానికి అద్దె సైకిల్‌పైనే రియాజ్‌ ఆధారపడాల్సి వచ్చేది.


ఆ ఇబ్బందుల నడుమే 2017లో ఢిల్లీ స్టేట్‌ సైక్లింగ్‌ పోటీల్లో కాంస్య పతకం, గువాహటిలో జరిగిన స్కూల్‌ గేమ్స్‌లో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. మీడియా ద్వారా ఈ విషయాలను తెలుసుకున్న రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌.. ఒక రేసింగ్‌ సైకిల్‌ను రియాజ్‌కు శుక్రవారం బహూకరించారు. అంకితభావం, కృషి, ధైర్యం, నిజాయితీతో యువత ముందుకు రావాలని ఆకాంక్షించారు. శనివారం ఈద్‌-అల్‌-అధా. ఆ రోజున పెద్దలు పిల్లలకు బహుమతులు ఇస్తారు. అయితే, ఒక రోజు ముందుగానే తన జీవితాశయానికి చుక్కాని వంటి బహుమతి దక్కడంతో రియాజ్‌ ఆనందానికి అవధుల్లేవు.

Updated Date - 2020-08-01T08:33:40+05:30 IST