కరోనా ఆంక్షలు వద్దంటూ.. దగ్గుతూ దేశాధ్యక్షుడి స్పీచ్

ABN , First Publish Date - 2020-04-22T01:05:05+05:30 IST

ప్రపంచం మొత్తం కరోనాపై పోరుకు నడుంకట్టి.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని లాక్‌డౌన్‌లు విధిస్తుంటే, ఇది తప్పంటూ ఓ దేశాధ్యక్షుడు ఆందోళనకు దిగారు.

కరోనా ఆంక్షలు వద్దంటూ.. దగ్గుతూ దేశాధ్యక్షుడి స్పీచ్

బ్రసిల్లా: ప్రపంచం మొత్తం కరోనాపై పోరుకు నడుంకట్టి.. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావొద్దని లాక్‌డౌన్‌లు విధిస్తుంటే, ఇది తప్పంటూ ఓ దేశాధ్యక్షుడు ఆందోళనకు దిగారు. ఆయనెవరో కాదు.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా వార్తల్లో నిలిచే బ్రెజిల్ దేశాధ్యక్షుడు జైర్ బొల్సొనారో. ఇలా లాక్‌డౌన్‌లు విధించడం మానవుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించి వేస్తాయని బొల్సొనారో వ్యాఖ్యానించారు. ఈ మేరకు కరోనా నియంత్రణ కోసం ప్రజలపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలంటూ జరిగిన ఓ ఆందోళనలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. కనీసం మాస్కు కూడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్న బొల్సొనారో.. ఉపన్యాసం ఇస్తున్న సమయంలో బొల్సొనారో విపరీతంగా దగ్గుతూ కనిపించారు. ఆందోళనలో పాల్గొంటున్న వారంతా గొప్ప దేశభక్తులని, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడటానికి వాళ్లంతా పోరాడుతున్నారని కొనియాడారు. ఓ దేశాధ్యక్షుడు ఇలా మాట్లాడటం విమర్శలకు దారితీసింది. అయితే బొల్సొనారో విపరీతంగా దగ్గడం చూసిన వారు, ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, బ్రెజిల్‌లో ఇప్పటి వరకు సుమారు 41వేల కరోనా కేసులు నమోదవగా 2600మంది వరకూ మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-04-22T01:05:05+05:30 IST