ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా
ABN , First Publish Date - 2020-09-01T07:54:28+05:30 IST
కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. ఈనెల 15లోగా దీనిని కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో కట్టాలని, ఒకవేళ చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, మూడేళ్లపాటు న్యాయవాదిగా విధులు నిర్వర్తించకుండా నిషేధం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది...

- కట్టకపోతే మూడు నెలల జైలు.. ఫైన్ కట్టేస్తా :భూషణ్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌కు సుప్రీంకోర్టు ఒక రూపాయి జరిమానా విధించింది. ఈనెల 15లోగా దీనిని కోర్టు రిజిస్ట్రార్ కార్యాలయంలో కట్టాలని, ఒకవేళ చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని, మూడేళ్లపాటు న్యాయవాదిగా విధులు నిర్వర్తించకుండా నిషేధం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జడ్జీలపై వ్యాఖ్యలు చేయవచ్చా లేదా.. అన్న అంశంపై దేశవ్యాప్తంగా విశేష చర్చను రేకెత్తిన ఈ కేసులో సుప్రీంకోర్టు ఓ రకంగా ఔదార్యంతో వ్యవహరించిందని న్యాయనిపుణులు అంటున్నారు. శిక్ష పడ్డ ప్రశాంత్ భూషణ్- తాను ఆ రూపాయిని చెల్లిస్తానని అంటూనే, తీర్పుపై సమీక్ష కూడా కోరతానని పేర్కొన్నారు. సుప్రీం సీజేలపై 2009లో తీవ్ర వ్యాఖ్యలు చేసిన మరో కేసు కూడా భూషణ్‌పై ఉంది. దానిని ఈ మధ్యే విస్తృత ధర్మాసనానికి పంపారు. చీఫ్ జస్టిస్ బోబ్డే ఓ కొత్త హర్లీ డేవిడ్సన్ మోటార్‌బైక్‌పై కూర్చుని ఉన్న ఫొటోపై వ్యాఖ్యలు చేయడం, గతంలో పనిచేసిన మరో నలుగురు సీజేలపై కూడా ట్విటర్లో వ్యాఖ్యానించడంతో సుప్రీంకోర్టు స్వచ్ఛందంగా ఆయన కేసును చేపట్టింది.
క్షమాపణలు చెప్పడానికి ప్రశాంత్ భూషణ్ తుదిదాకా నిరాకరించారు. దీంతో జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ ఆయన కోర్టు ధిక్కారానికి పాల్పడ్డట్లు దోషిగా తేల్చి- సోమవారంనాడు ఈ రూపాయి జరిమానా లేదంటే జైలు శిక్షలను ఖరారు చేసింది. జస్టిస్ మిశ్రా ఈ బుధవారం పదవీ విరమణ చేస్తారు. ఆయనకు వీడ్కోలిచ్చే సభను సుప్రీంబార్ ఏర్పాటు చేసినా కొవిడ్ వల్ల హాజరుకాలేనని అన్నారు. ప్రస్తుతం ఈయన సుప్రీంకోర్టులో నెంబర్ 3 జడ్జి. సీజే బోబ్డే వచ్చే ఏడాది పదవీ విరమణ చేశాకనెంబర్ టూ స్థానంలో ఉన్న జస్టిస్ ఎన్వీ రమణ సీజే అవుతారు.