రూపాయి జరిమానాపై ప్రశాంత్ భూషణ్ రివ్వ్యూ పిటిషన్

ABN , First Publish Date - 2020-10-01T23:21:16+05:30 IST

కోర్టు ధిక్కారం కేసులో దోషిగా ఇటీవల రూపాయి జరిమానా ఎదుర్కొన్న సీనియర్ న్యాయవాది...

రూపాయి జరిమానాపై ప్రశాంత్ భూషణ్ రివ్వ్యూ పిటిషన్

న్యూఢిల్లీ: కోర్టు ధిక్కారం కేసులో దోషిగా ఇటీవల రూపాయి జరిమానా ఎదుర్కొన్న సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇవాళ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తిపై ట్విటర్లో ‘‘పరువునష్టం’’ కలిగించేలా ఆరోపణలు చేసినందుకు భూషణ్‌ను సర్వోన్నత ధర్మాసనం దోషిగా ప్రకటించి రూ.1 జరిమానా విధించిన విషయం తెలిసిందే. తీర్పునకు అనుగుణంగా రూపాయి జరిమానా చెల్లించినప్పటికీ.. ఆయన ఈ తీర్పుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘జరిమానా చెల్లించినంత మాత్రాన నేను ఈ తీర్పును అంగీకరించినట్టు కాదు. మేము దీనిపై ఇప్పటికే రిట్ పిటిషన్ దాఖలు చేశాం. కోర్టు ధిక్కారం కింద దోషిగా గుర్తించడంపై పునర్విచారణకు వీలుకల్పించేందుకు ఓ ప్రక్రియ ఉండాలి కదా..’’ అని కోర్టు తీర్పు సందర్భంగా భూషణ్ పేర్కొన్నారు.


భూషణ్ రూపాయి జరిమానా చెల్లించకపోయివుంటే మూడు నెలల జైలు శిక్ష భరించాల్సి రావడంతో పాటు సుప్రీంకోర్టులో వాదించకుండా మూడేళ్ల పాటు నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చేది.  ఒకవేళ రివ్యూ పిటిషన్ విచారించిన తర్వాత సుప్రీంకోర్టు తన తీర్పును వెనక్కితీసుకుని, భూషణ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తే... మళ్లీ ఆ రూపాయిని తిరిగి ఇచ్చేస్తారు. ట్విటర్లో తాను చేసిన విమర్శలకు క్షమాపణ చెప్పబోననీ.. అవసరమైతే కోర్టులో విచారణ ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమేనని భూషణ్ తేల్చిచెప్పడంతో.. సదరు సీనియర్ లాయర్‌పై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. దీంతో వాక్‌స్వేచ్ఛపై పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. 

Updated Date - 2020-10-01T23:21:16+05:30 IST