పుస్తకంపై ప్రణబ్ కుమారుడు అలా... కుమార్తె ఇలా...
ABN , First Publish Date - 2020-12-16T00:25:33+05:30 IST
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్న తరుణంలో ఆయన పిల్లలు వాగ్యుద్ధానికి దిగారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు ఇటీవల వివాదాస్పదం కావడంతో తాను లిఖితపూర్వకంగా సమ్మతిస్తేనే దీన్ని విడుదల చేయాలని ప్రణబ్ కుమారుడు అభిజిత్ స్పష్టం చేశారు. అభిజిత్ హెచ్చరిక వెలువడిన కాసేపటికి ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ రంగంలోకి దిగి, ఈ పుస్తకం విడుదలకు అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని తన సోదరుడిని కోరారు.
అసలు కారణం ఏమిటంటే, ప్రణబ్ ముఖర్జీ రాసిన ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ జనవరిలో విడుదలవుతుందని ప్రచురణకర్త రూపా పబ్లికేషన్స్ ప్రకటించింది. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు ఇటీవల మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
‘‘2004లో నేను ప్రధాన మంత్రినై ఉంటే, 2014లో పార్టీ ఓటమి నుంచి బయటపడి ఉండేదని కొందరు కాంగ్రెస్ నేతలు అన్నారు. ఈ అభిప్రాయాన్ని నేను సమర్థించకపోయినప్పటికీ, రాష్ట్రపతిగా నా పదోన్నతి తర్వాత పార్టీ నాయకత్వం పొలిటికల్ ఫోకస్‌ను కోల్పోయింది. సోనియా గాంధీ పార్టీ వ్యవహారాలను నిర్వహించలేకపోగా, డాక్టర్ మన్మోహన్ సింగ్ సభ నుంచి సుదీర్ఘకాలం గైర్హాజరవడం ఇతర ఎంపీలతో వ్యక్తిగత సంబంధాలకు తెరదించింది’’ అని ప్రణబ్ ముఖర్జీ చెప్పినట్లు ఈ పుస్తకంలో ఉందని మీడియా పేర్కొంది.
ఈ అంశాలు వివాదాస్పదం కావడంతో ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి జీవిత చరిత్రలోని భాగాలంటూ విడుదలైన అంశాలను ‘‘ప్రేరేపిత సంగ్రహాలు’’గా అభివర్ణించారు. తన తండ్రి జీవిత చరిత్ర పుస్తకాన్ని తాను సరి చూసి, లిఖితపూర్వకంగా సమ్మతించే వరకు విడుదల చేయవద్దని ప్రచురణకర్తలను కోరారు. తన సమ్మతి లేకుండా కొన్ని మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో మోటివేటెడ్ సంగ్రహాలు సర్క్యులేట్ అవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ. ఆయన మంగళవారం ఇచ్చిన ట్వీట్లలో తన తండ్రి జీవిత చరిత్ర పేరుతో కొన్ని మోటివేటెడ్ సంగ్రహాలు ప్రచారమవుతుండటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ రచయిత అయిన ప్రణబ్ ముఖర్జీకి తాను కుమారుడినని పేర్కొన్నారు. తన లిఖితపూర్వక సమ్మతి లేకుండా కొన్ని మీడియా ప్లాట్‌ఫాంలలో మోటివేటెడ్ సంగ్రహాలు సర్క్యులేట్ అవుతున్నాయని, వీటిని, ఈ పుస్తకాన్ని ప్రచురించడం తక్షణమే ఆపాలని కోరారు.
తన తండ్రి స్వర్గస్థులైనందువల్ల ఆయన పుస్తకం ఫైనల్ కాపీని తాను ఆయన కుమారునిగా పూర్తిగా చదవాలనుకుంటున్నానని పేర్కొన్నారు. తన తండ్రి నేడు జీవించి ఉండి ఉంటే ఆయన కూడా ఇదే పని చేసేవారని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందు ఫైనల్ కాపీని తాను చదివి, లిఖితపూర్వకంగా సమ్మతి తెలియజేసే వరకు ఈ పుస్తకాన్ని ఆపాలని కోరారు. దీనికి సంబంధించిన సవివరమైన లేఖను తాను పంపించానని, అది త్వరలోనే ప్రచురణకర్తలకు అందుతుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ట్విటర్ వేదికగా తన సోదరునికి గట్టి సలహా ఇచ్చారు. ఈ పుస్తకం విడుదలకు అనవసరమైన అడ్డంకులు సృష్టించవద్దని కోరారు.
‘‘నేను, ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ రచయిత కుమార్తెను, మా తండ్రి గారు రాసిన చివరి పుస్తకం ప్రచురణలో అనవసరమైన ఆటంకాలు సృష్టించవద్దని నా సోదరుడు అభిజిత్ ముఖర్జీని కోరుతున్నాను. ఈ మాన్యుస్క్రిప్ట్‌ను ఆయన అస్వస్థులవడానికి ముందు పూర్తి చేశారు’’ అని శర్మిష్ఠ పేర్కొన్నారు.
‘‘ఫైనల్ డ్రాఫ్ట్‌లో మా తండ్రి గారి చేతి రాతతో నోట్స్, కామెంట్స్ ఉన్నాయి. వాటిని కచ్చితంగా పాటించారు. ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన స్వంతం, చీప్ పబ్లిసిటీ కోసం ఎవరూ దీని ప్రచురణను ఆపేందుకు ప్రయత్నించకూడదు. అలా చేస్తే స్వర్గస్థులైన మన తండ్రిగారికి తీవ్రమైన హాని చేయడమవుతుంది’’ అని శర్మిష్ఠ పేర్కొన్నారు.