తెలంగాణ ఏర్పాటులోనూ ప్రణబ్ కీలక పాత్ర!
ABN , First Publish Date - 2020-09-01T07:37:45+05:30 IST
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు...

హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటుపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నియమించిన కమిటీకి నేతృత్వం వహించారు. రాష్ట్ర విభజన చట్టం ఆమోదం వరకు పలు ఘట్టాల్లో ఆయన తనదైన పాత్ర పోషించారు. చివరికి విభజన చట్టానికి రాష్ట్రపతి హోదాలో ఆమోదముద్ర వేసిందీ ఆయనే. రెండు దశాబ్దాల కిందట సోనియాగాంధీ ఎన్‌ఎ్‌సయూఐ కార్యక్రమంలో పాల్గొనేందుకు సికింద్రాబాద్ వచ్చారు. అప్పుడు 41 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా పార్టీలో తీర్మానం చేయాల్సిందిగా ఆమెను కోరారు. ఈ నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ప్రణబ్‌ముఖర్జీ ఆధ్వర్యంలో కమిటీ వేశారు.
కమిటీ పనిలో భాగంగా ప్రణబ్ పార్టీలోని ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ నేతలు, వివిధ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించారు. వాటి ఆధారంగా నివేదిక రూపొందించి, సోనియాకు సమర్పించారు. ఉమ్మడి ఏపీకి రోశయ్య సీఎం అయిన తర్వాత.. ఢిల్లీలో పార్టీ ఎంపీలకు విందు ఇచ్చారు. ఆ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీలు నేరుగా వెళ్లి ప్రణబ్‌ని కలిశారు. అప్పుడాయన ఉద్యమంలో ప్రజలతో కలిసి ముందుకు పోవాలని వారికి సూచించారు. ఆ స్ఫూర్తితోనే తాము ఉద్యమంలో దూకుడుగా వెళ్లామంటూ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలుపుతూ ఆర్డినెన్సుకు రాష్ట్రపతిగా ప్రణబే ఆమోదముద్ర వేశారు.
తెలంగాణ నేతలతో సాన్నిహిత్యం
మాజీ ప్రధాని పీవీ మొదలుకొని కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి, పీసీసీ మాజీ చీఫ్, ప్రస్తుత టీఆర్‌ఎస్ ఎంపీ డీఎస్ వరకు తెలంగాణ నేతలతో ప్రణబ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పీవీ మంత్రివర్గంలో ప్రణబ్‌ముఖర్జీ పని చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల పీవీ శత జయంతి ఉత్సవాలను టీపీసీసీ ఆధ్వర్యంలో ప్రారంభించినప్పుడు ప్రణబ్ తన సందేశాన్ని పంపారు. ప్రణబ్‌ముఖర్జీ కుమార్తె, ఢిల్లీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శర్మిష్ట ముఖర్జీ 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు ఏఐసీసీ నియమించిన స్ర్కీనింగ్ కమిటీలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు.
కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ..
ముసాయిదాల రూపకల్పనలో ప్రణబ్‌ముఖర్జీ దిట్ట. 2004లో యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ అంశాన్ని చేర్చడంలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావించడంలోనూ ప్రణబ్ పాత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేతలు తెలిపారు. టీఆర్‌ఎ్‌సతో పొత్తు పెట్టుకుని ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ 2004లో అధికారంలోకి వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని సరైన సమయంలో పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని సీఎంపీలో చేర్చారు. సీఎంపీలో తెలంగాణ అంశాన్ని చేర్చడంతో టీఆర్‌ఎస్ కేంద్ర మంత్రివర్గంలో చేరింది.