‘ఇప్పటికీ విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం, అయితే హెమోడైనమికల్లీ నిలకడగా ఉన్నారు’

ABN , First Publish Date - 2020-08-12T20:57:58+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. భారత సైన్యానికి చెందిన

‘ఇప్పటికీ విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం, అయితే హెమోడైనమికల్లీ నిలకడగా ఉన్నారు’

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. భారత సైన్యానికి చెందిన న్యూఢిల్లీలోని రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ బుధవారం విడుదల చేసిన మెడికల్ బులెటిన్‌లో ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, అయితే రక్త ప్రసరణ విషయంలో (హెమోడైనమికల్లీ) నిలకడగా ఉందని తెలిపింది. ఆయన మెదడుకు సోమవారం శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. 


‘‘ప్రస్తుతం ఆయన హెమోడైనమికల్లీ నిలకడగా ఉన్నారు, వెంటిలేటర్ సహాయం తీసుకుంటున్నారు’’ అని మెడికల్ బులెటిన్ పేర్కొంది. 


ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ బుధవారం ఉదయం ఇచ్చిన ఓ ట్వీట్‌లో తన తండ్రి విషయంలో భగవంతుడు సరైన మార్గాన్ని ఎంచుకుంటాడని ఆశిస్తున్నట్లు, రాబోయేది ఏదైనా, దానిని స్వీకరించే బలాన్ని తనకు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే సమయంలో ఆయనకు ‘భారత రత్న’ పురస్కారం లభించిందని, ఈ ఏడాది ఆయన అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నారని వాపోయారు. 


Updated Date - 2020-08-12T20:57:58+05:30 IST