ఏటీఎంకు వెళ్లి డ్రా చేసుకోకుండానే డబ్బు ఇంటికి..!

ABN , First Publish Date - 2020-04-05T18:35:52+05:30 IST

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ..

ఏటీఎంకు వెళ్లి డ్రా చేసుకోకుండానే డబ్బు ఇంటికి..!

కేరళ: కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ సమయంలో కొందరు ప్రజలు ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు వెళుతున్నామని చెప్పి ఇతరత్రా పనులు చూసుకుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది.


దీంతో.. పోస్టల్ సిబ్బందితో ఏటీఎంల వద్దకు జనం వెళ్లకుండానే ప్రజలకు డబ్బును అందజేయాలన్న ప్రతిపాదనకు కేరళ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. దీని ద్వారా.. జనం లాక్‌డౌన్ వేళ బయట తిరగకుండా కట్టడి చేయడంతో పాటు ఏటీఎంల వద్ద గుమిగూడకుండా చేయొచ్చని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ ఇంటికే డబ్బు పంపిణీ సేవలు ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.


ఈ సేవలను వినియోగించుకోవాలనుకునే ప్రజలు స్థానిక పోస్టు ఆఫీసుల్లో తాము విత్‌డ్రా చేసుకునే డబ్బుకు సంబంధించి వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడు స్థానిక పోస్ట్ ఆఫీస్‌లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సేవలను వినియోగించుకునే బ్యాంకు ఖాతాదారులు ఒకసారికి పదివేలు మాత్రమే పొందగలరు. ఇదిలా ఉంటే.. కేరళలో ఇప్పటికే 306 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో కరోనా వైరస్‌ బారిన పడి ఇద్దరు మరణించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 12 లక్షలు దాటాయి.

Updated Date - 2020-04-05T18:35:52+05:30 IST