ముం‘భయం’.. భయం!

ABN , First Publish Date - 2020-04-21T09:42:07+05:30 IST

మహారాష్ట్రలో కరోనా కేసులు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బయటపడిన 466 కేసులతో మొత్తం సంఖ్య 4,666కు చేరింది. మహమ్మారి కబళించిన

ముం‘భయం’.. భయం!

  • వాణిజ్య రాజధానిలో 3 వేలు దాటిన పాజిటివ్‌ కేసులు
  • ఏడున్నర రోజుల్లోనే కరోనా కేసులు రెట్టింపు.. 53 మంది మీడియా సిబ్బందికీ
  • అహ్మదాబాద్‌లో 24 మంది పోలీసులకు వైరస్‌..
  • యూపీలో వైద్యుడి మృతి
  • మహారాష్ట్రలో కొత్తగా 466 కేసులు 
  • దేశంలో కేసులు 17,656, మరణాలు 559

నూఢిల్లీ/ముంబై, ఏప్రిల్‌ 20: మహారాష్ట్రలో కరోనా కేసులు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా బయటపడిన 466 కేసులతో మొత్తం సంఖ్య 4,666కు చేరింది. మహమ్మారి కబళించిన వారి సంఖ్య 232కు పెరిగింది. రాష్ట్రంలోకెల్లా ముంబైలో పరిస్థితి కలవరపరుస్తోంది. దేశ వాణిజ్య రాజధానిలో కేసుల సంఖ్య 3 వేల మార్కు దాటిపోయింది. కొత్తగా 155 కేసులు నమోదవడంతో మొత్తం 3,090కి పెరిగాయి. 53 మంది మీడియా సిబ్బందికి కరోనా సోకడం గమనార్హం.  ఇక దేశంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం పెరుగుతోంది. లాక్‌డౌన్‌ విధించడానికి ముందు 3.4 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అవగా ప్రస్తుతం అది 7.5 రోజులకు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ విషయంలో జాతీయ సగటు కంటే 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ‘‘గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,540 కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 17,656కు, మరణాలు 559కు పెరిగాయి’’ అని వివరించారు. 


మహారాష్ట్రలో సడలింపులు

దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు నమోదైనా లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇవ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపింది.  పారిశ్రామిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేందుకు ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లలో నిబంధనలను కొంతవరకు సడలిస్తున్నామని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. పేర్కొన్నారు.  గుజరాత్‌లో కొత్తగా 201 మందికి కరోనా వైరస్‌ సోకింది. వీటిలో 91 అహ్మదాబాద్‌లోనే నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 24 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకింది. వీరిలో 9 మంది ట్రాఫిక్‌ పోలీసులు ఉన్నారు. హాట్‌స్పాట్‌గా గుర్తించిన ఖడియా ప్రాంతానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ ఒకరు కరోనా బారినపడ్డారు. యూపీలోని మొరదాబాద్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం వైద్యుడు కరోనా సోకి మరణించారు. 

Updated Date - 2020-04-21T09:42:07+05:30 IST