జన క్షీణత!
ABN , First Publish Date - 2020-07-18T07:27:49+05:30 IST
ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 780 కోట్లు. ఈ శతాబ్దం చివరినాటికి అది 1,008 కోట్ల వరకు పెరగొచ్చని గతంలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసినా.. 880 కోట్లకే పరిమితమవుతుందని....

2100 కల్లా ప్రపంచ జనాభా తగ్గుముఖం
880 కోట్లు ఉండొచ్చని అంచనా
చైనా జనాభా సగం క్షీణించే అవకాశం
144 కోట్ల నుంచి 73 కోట్లకు..
ప్రస్తుతం ప్రపంచ జనాభా సుమారు 780 కోట్లు. ఈ శతాబ్దం చివరినాటికి అది 1,008 కోట్ల వరకు పెరగొచ్చని గతంలో ఐక్యరాజ్యసమితి అంచనా వేసినా.. 880 కోట్లకే పరిమితమవుతుందని వాషింగ్టన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. . ‘చైనా జనాభా సగానికి తగ్గిపోవచ్చు. ఇప్పుడున్న 144 కోట్ల నుంచి మరో 80 ఏళ్లలో 73 కోట్లకు తగ్గిపోతుంది. జపాన్, స్పెయిన్, ఇటలీ, థాయ్‌లాండ్, పోర్చుగల్, దక్షిణ కొరియా, పోలండ్ తదితర 20 దేశాల జనాభా కూడా సగానికిపైనే తగ్గిపోతుంది. అయితే సబ్-సహారన్ ఆఫ్రికా జనాభా మూడు రెట్లు పెరిగి.. 300 కోట్లకు చేరనుంది. ఇందులో ఒక్క నైజీరియాలోనే 2100నాటికి 80 కోట్ల జనాభా ఉంటారు. అప్పటికి ప్రపంచంలో జనాభాపరంగా 109 కోట్లతో భారత్ ప్రథమ స్థానంలో ఉంటుంది. నైజీరియా రెండో స్థానంలో నిలుస్తుంది’ అని పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఆయా దేశాల్లో జనాభాపరంగా వచ్చే మార్పులు పర్యావరణానికి మంచిదేనని శాస్త్రవేత్తల బృందం నాయకుడు క్రిస్టోఫర్ ముర్రే తెలిపారు. ఆహారోత్పత్తి వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని.. కార్బన్ వాయువుల విడుదల బాగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఆఫ్రికాయేతర దేశాల్లో పనివయసు బాగా తగ్గిపోతుందని.. ఆయా ఆర్థిక వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతుందని తెలిపారు.
నైజీరియాలో మాత్రం పనివయసు ఉన్న వారి సంఖ్య భారీగా పెరుగుతుందని.. ఇప్పుడున్న 8.6 కోట్ల నుంచి 45 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ‘ప్రపంచవ్యాప్తంగా సంతానోత్సత్తి రేటు (టీఎ్‌ఫఆర్) తగ్గనుంది. ఈ క్రమంలో 2100 నాటికి ఐదేళ్లలోపు పిల్లల సంఖ్య 40 శాతానికిపైగా తగ్గిపోతుంది. 2017లో ఈ వయసు పిల్లలు 68.1 కోట్ల మంది ఉండగా.. 80 ఏళ్లనాటికి వారి సంఖ్య 40 కోట్లకు తగ్గిపోతుంది’ అని వెల్లడించారు. అమెరికాలో 2062 నాటికి జనాభా 36.4 కోట్లకు పెరగొచ్చని. కానీ 2100కి 33.6 కోట్లకు తగ్గుతుందన్నారు. పనివయసు కలిగినవారి సంఖ్య 18.1 కోట్లకు చేరుతుందని.. ఫలితంగా వలస విధానాలను సంస్కరించుకోవలసి ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా చైనాలో ఉద్యోగ వయసు ఉన్నవారి సంఖ్య 2017లో 95 కోట్లు ఉండగా.. 2100 నాటికి 35.7 కోట్లకు పడిపోవచ్చన్నారు. 2050నాటికి జీడీపీలో చైనా అమెరికాను దాటి ప్రథమ స్థానానికి చేరుకుంటుంది. అమెరికా రెండో స్థానానికి పడిపోతుంది. భారత్ మాత్రం మూడో స్థానానికి ఎదుగుతుంది. జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ పది అగ్ర దేశాల సరసన ఉంటాయి. బ్రెజిల్ 8 నుంచి 13వ ర్యాంకుకు, రష్యా 10 నుంచి 14వ స్థానానికి దిగుతాయి. ఇండోనేషియా 12వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుంది. 28వ స్థానంలో ఉన్న నైజీరియా పదో స్థానంలోకి వస్తుంది.
భారత్ నంబర్ 1..
2100 నాటికి భిన్న ధ్రువ ప్రపంచం ఆవిర్భవిస్తుంది. భారత్ ప్రథమ స్థానం లో ఉంటుంది. ఆ తర్వాత స్థానాల్లో నైజీరియా, చైనా, అమెరికా ఉంటాయి.
జనాభాలో యువత, వృద్ధుల శాతం 2100నాటికి మారిపోయే అవకాశం ఉంది. 65 ఏళ్లకు పైబడినవారి సంఖ్య 237 కోట్లకు చేరుతుంది. 20 ఏళ్లలోపు వారి సంఖ్య 170 కోట్లు ఉండొచ్చు.
ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సంతానోత్పత్తి రేటు (టీఎ్‌ఫఆర్) 2017నాటికి 2.37గా ఉంది. 2100 నాటికి ఇది 1.66కి తగ్గిపోతుంది. భారత్‌లో సంతానోత్పత్తి రేటు 2019నాటికే 2.1కి తక్కువగా ఉంది. 2100కల్లా 1.29కి చేరుతుంది. 2017 నాటి డేటా ఆధారంగా ఈ అంచనాలు వేశారు.
- సెంట్రల్ డెస్క్
27 ఏళ్లలో చైనాను దాటేస్తాం!
161 కోట్లకు భారత జనాభా..
తర్వాత భారీగా తగ్గుదల.. అయినా ప్రపంచంలో మనమే ఫస్ట్?
ప్రస్తుతం భారత జనాభా సుమారు 135 కోట్లు. ప్రపంచంలో చైనా (144 కోట్లు) తర్వాతి స్థానంలో ఉన్నాం. మరో 27 ఏళ్లలో పాతికేళ్లలో ఆ దేశాన్ని అవలీలగా దాటేస్తుందని.. 161 కోట్లకు చేరుకుంటుందని తాజా అంచనా. అయితే అక్కడి నుంచి క్రమేణా జనాభా తగ్గిపోతుంది. ఈ శతాబ్దం చివరి నాటికి.. అంటే 2100 కల్లా 109 కోట్లకు తగ్గుతుంది. అయినా ప్రపంచంలోనే జనాభాపరంగా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్‌డీపీ) కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం చేసిన అధ్యయనం వివరాలను ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ తన తాజా సంచికలో పొందుపరచింది. ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ-2017’ డేటా ఆధారంగా.. మరణాలు, సంతానోత్పత్తి (టీఎ్‌ఫఆర్), వలసల రేట్లు ప్రాతిపదికగా.. భారత్, అమెరికా, చైనా, జపాన్ సహా 183 దేశాల భావి జనాభా హెచ్చుతగ్గులపై ఈ అధ్యయనం నిర్వహించారు. భారత్‌లోనేగాక ప్రపంచమంతటా జనాభా తగ్గిపోనుందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా మహిళలు విద్యావంతులవుతారని.. గర్భనిరోధం తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన వారికి వస్తుందని.. ఆ ఫలితంగానే జనసంఖ్య తగ్గిపోతుందని అభిప్రాయపడింది.
