‘రజనీ వచ్చినా మా ఓటు బ్యాంకుకు ఢోకా లేదు’

ABN , First Publish Date - 2020-12-10T17:46:13+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం వల్ల అధికార

‘రజనీ వచ్చినా మా ఓటు బ్యాంకుకు ఢోకా లేదు’

  • రజనీ రాకపై అన్నాడీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి పొన్నయ్యన్‌


చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశం వల్ల అధికార అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చెక్కుచెదరదని, రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నరలక్షల మంది కార్యకర్తలు కలిగిన పటిష్ఠమైన పార్టీ తమదని ఆ పార్టీ వ్యవస్థాపక కార్యదర్శి, మాజీ మంత్రి సి.పొన్నయ్యన్‌ ధీమా వ్యక్తం చేశారు. చెన్నైలో మీడియాతో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకంటే ముందు అన్నాడీఎంకే ముందస్తు ఏర్పాట్లన్నీ ముగించిందన్నారు. సీఎం అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఎడప్పాడిని ప్రకటించిందని, ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టో తయారవుతోందన్నారు. రజనీకాంత్‌ దశాబ్దాల తరబడి పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారని, జనవరిలో పార్టీ ప్రారంభించిన తర్వాతే ఆయన ఆశయాలు, లక్ష్యాలు సమగ్రంగా తెలుసుకోవడానికి వీలుపడుతుందని పొన్నయ్యన్‌ అన్నారు. రజనీ ప్రారంభించే పార్టీయే కాదు, రాష్ట్రంలోని ఏ పార్టీల వల్ల కూడా అన్నాడీఎంకేకు ఎలాంటి నష్టం కలుగదని ఆయన అన్నారు.


అన్నాడీఎంకేని ఓడించే శక్తితో కూడిన పార్టీగా రజనీ పార్టీ ఉండే ప్రసక్తే లేదన్నారు. రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలు స్థాపిస్తానని చెప్పడం కూడా విడ్డూరంగా ఉందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావాలను పుణికిపుచ్చుకున్న రజనీకాంత్‌ ద్రావిడ సిద్ధాంతాలను పెంచిపోషిస్తున్న తమిళనాట ఎలాంటి మార్పులు తీసుకురాలేకపోవచ్చని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీలతో పొత్తుపెట్టుకుంటారా అని ప్రశ్నించినప్పుడు. ప్రస్తుతం అన్నాడీఎంకే కూటమిలో ఏ మిత్రపక్షమూ వైదొలగలేదని, కూటమి బలంగానే కొనసాగుతోందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా కొత్త పార్టీలు కూటమిలో చేరే అవకాశం లేకపోలేదన్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులంతా సమవేశమై అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. శశికళ మరో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఆమెకు అన్నాడీఎంకేకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఆమె జైలు నుండి విడుదలైనా రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించవన్నారు.

Updated Date - 2020-12-10T17:46:13+05:30 IST