‘రజనీ పార్టీ ప్రారంభం వెనుక బీజేపీ హస్తం లేదు’

ABN , First Publish Date - 2020-12-15T17:00:59+05:30 IST

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బీజేపీ

‘రజనీ పార్టీ ప్రారంభం వెనుక బీజేపీ హస్తం లేదు’

చెన్నై : సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బీజేపీ ఒత్తిడి కారణంగానే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారని వస్తున్న పుకార్లను ఆ పార్టీ సీనియర్‌ నేత మాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్‌ తీవ్రంగా ఖండించారు. రజనీ పార్టీ ప్రారంభం వెనుక  బీజేపీ ప్రమేయం ఏమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. రజనీ లాంటి నాయకులు రాజకీయాల్లోకి రావడం మంచిదేనని, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలని ఆకాంక్షిస్తున్న ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలిపానని రాధాకృష్ణన్‌ చెప్పారు. బీజేపీ ఏ పార్టీల వెనుక వుండదని, అన్ని పార్టీలకు ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.


కూటమిలో కొనసాగుతున్నాం

ఇదిలా ఉండగా అన్నాడీఎంకే కూటమిలోనే బీజేపీ కొనసాగుతోందని ఆ పార్టీ శాఖ అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ స్పష్టం చేశారు. చెన్నైలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలలో పోటీ చేయడం ఖాయమని, ఈసారి అసెంబ్లీలో పార్టీ సభ్యులు తప్పకుండా ఉంటారని చెప్పారు. అన్నాడీఎంకే కూటమిలో ఎన్ని సీట్లు పొందాలనే విషయంపై బీజేపీ అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌ తర్వాత సీట్ల కేటాయింపులపై చర్చలు జరుగుతాయని మురుగన్‌ చెప్పారు. రజనీ రాజకీయప్రవేశంతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు ఓటమి భయం పట్టుకుం దని అన్నారు. ఈసారి ఎన్నికల్లో డీఎంకే ఘోరపరాజయాన్ని చవిచూడక తప్పదని ఆయన అన్నారు.

Updated Date - 2020-12-15T17:00:59+05:30 IST