రేషన్‌ దుకాణాల వద్ద పోలీసు బందోబస్తు

ABN , First Publish Date - 2020-12-30T14:57:57+05:30 IST

వినియోగదారులను నియంత్రించేలా ప్రతి రేషన్‌ దుకాణం వద్ద

రేషన్‌ దుకాణాల వద్ద పోలీసు బందోబస్తు

చెన్నై : సంక్రాంతి బహుమతి ప్యాకెట్‌ పొందేందుకు వచ్చే వినియోగదారులను నియంత్రించేలా ప్రతి రేషన్‌ దుకాణం వద్ద ఇద్దరు పోలీసులతో బందోబస్తు  ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భగా రాష్ట్రంలోని 2.10 లక్షల రేషన్‌ కార్డులకు పచ్చిబియ్యం, చక్కెర, యాలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, చెరకు గడతో పాటు రూ.2,500 నగదు అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ రేషన్‌ దుకాణాల వద్ద ప్రజల రద్దీని నియంత్రించేలా రేషన్‌ ఉద్యోగులు వారి ఇళ్లకే వెళ్లి టోకెన్లు అంద జేస్తున్నారు.


ఈ నెల 26న ప్రారంభమైన ఈ టోకెన్ల పంపిణీ  31వరకు జరగనుంది. అనంతరం 1వ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు కావడంతో, 2, 3 తేదీల్లో దుకాణాలకు సరుకులు, గిఫ్ట్‌ప్యాక్‌లను తరలించి, 4వ తేదీ నుంచి వినియోగదారులకు పంపిణీజేయనున్నారు. దుకాణాల వద్ద రద్దీని నియంత్రించేలా ఉదయం వందమంది, మధ్యాహ్నం వందమంది చొప్పున రోజుకు 200 మందికి సరుకులు, గిఫ్ట్‌ ప్యాక్‌ అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25,589 శాశ్వత దుకాణాలు, 9,580 తాత్కాలిక దుకాణాల్లో ఈ పంపిణీ జరుగనుంది. అదే సమయంలో ప్రతి దుకాణంలో  రోజూ రూ.5 లక్షల నగదు పంపిణీ చేయాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రూ.1,300 కోట్ల నుంచి రూ.1,350 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుంది. దీంతో, దుకాణాల వద్ద భద్రత, వినియోగదారులు భౌతికదూరం పాటించేలా క్యూలైన్ల పర్యవేక్షణ తదితరాలకు ఒక్కో దుకాణం వద్ద ఇద్దరు చొప్పున మొత్తం 70 వేల మంది పోలీసులతో బందోబస్తుకు చేపడతారని ఆహార శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-12-30T14:57:57+05:30 IST