కరోనా వేషం వేసుకున్న పోలీసు.. రోడ్ల మీదికి వచ్చిన వాళ్లను ఆపి..!

ABN , First Publish Date - 2020-03-28T21:20:47+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. ఈ మహమ్మారిపై కవులు, కళకారులు, వైద్యులు తమదైన శైలిలో...

కరోనా వేషం వేసుకున్న పోలీసు.. రోడ్ల మీదికి వచ్చిన వాళ్లను ఆపి..!

చెన్నై: కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. ఈ మహమ్మారిపై కవులు, కళకారులు, వైద్యులు తమదైన శైలిలో ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ‘సామాజిక దూరం’పై అవగాహన కోసం కొందరు షాపింగ్ మాల్స్, కూరగాయ మార్కెట్లలో వృత్తాలు గీసి చూపిస్తుండగా.. దైవ దర్శనాలకు దూరం కాకుండా ఆలయాలు సైతం వెబ్ క్యాస్టింగ్‌ను ఎంచుకున్నాయి. తాజాగా తమిళనాడు పోలీసులు సైతం తమదైన శైలిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్ ఆకారంలో తయారు చేసిన హెల్మెట్ ధరించి... రోడ్ల మీదికి వచ్చిన వాహనదారులకు క్లాస్ పీకుతున్నారు.


తమ వినూత్న ప్రయత్నంపై ఇన్‌స్పెక్టర్ రాజేశ్ బాబు మాట్లాడుతూ.. ‘‘మేము ఎంత చెప్పినా కొంతమందికి కరోనా ప్రభావం గురించి అర్థం కావట్లేదు. అందుకే ఏదైనా కొత్తగా చేయాలనిపించింది. దీనికోసం అచ్చం కరోనా వైరస్‌ను పోలిన హెల్మెట్ తయారు చేయించాం. ఇలాగైనా ప్రజల్లో కరోనాపై భయం పెంచి, వారిని ఇళ్లకే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం..’’ అని వెల్లడించారు. కాగా ఇటీవల భారత శాస్త్రవేత్తలు కోవిడ్-19 వ్యాధికి కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్  మైక్రోస్కోపీ చిత్రాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. Updated Date - 2020-03-28T21:20:47+05:30 IST