మోదీ ‘ఆదర్శ’ పథకంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి..

ABN , First Publish Date - 2020-06-22T19:12:48+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక, విశేష ప్రాచుర్యం కల్పించిన వినూత్న పథకం ‘సన్సద్ ఆదర్శ గ్రామ యోజన’..

మోదీ ‘ఆదర్శ’ పథకంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి..

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానస పుత్రిక, ఆయనకు విశేష ప్రాచుర్యం కల్పించిన వినూత్న పథకం ‘సన్సద్ ఆదర్శ గ్రామ యోజన’ (ఎస్ఏజీవై) పథకంపై షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ పథకానికి ఎంపికైన గ్రామాల్లో ఇప్పటి వరకు ఏమాత్రం మార్పు రాలేదని ఓ కేంద్ర పనితీరు నివేదిక గుర్తించింది. పల్లెల్లో సర్వతోముఖ వికాసం కోసం రూపొందించిన ఎస్ఏజీవై ప్రారంభమై ఆరేళ్లు పూర్తైనా లక్ష్యాన్ని చేరుకోలేదనీ.. గ్రామీణ అభివృద్ధి శాఖ దీన్ని పునఃసమీక్షించి మరింత మెరుగ్గా అమలు చేయాలని పేర్కొంది. గ్రామాల్లో అమలవుతున్న పథకాలపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెప్పించుకున్న కామన్ రివ్యూ మిషన్-2019 (సీఆర్ఎం) ఈ మేరకు పలు సూచనలు చేసింది. ‘‘రాష్ట్రాల్లో పర్యటించిన సీఆర్ఎం బృందాలకు ఎస్ఏజీవై వల్ల గ్రామాల్లో చెప్పుకోదగిన మార్పులేవి కనిపించలేదు. ఎంపిక చేసిన ఎస్ఏజీవై పంచాయతీలకు ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధుల నుంచి పెద్దగా నిధులు మంజూరు చేయలేదు. ఎంపీలు క్రియాశీలకంగా పనిచేసిన కొన్ని గ్రామాల్లో మాత్రం కొంత మేర మౌలిక సదుపాయాలు మెరుగైనప్పటికీ.. ప్రత్యేకంగా ఈ పథకం వల్ల గుర్తించదగిన మార్పులేవీ లేవు...’’ అని సీఆర్ఎం నివేదిక పేర్కొంది. 


గ్రామాల సర్వతోముఖ అభివృద్ధే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 11న సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన(ఎస్ఏజీవై) ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యుడు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని 2016 నాటికల్లా దాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దాలి. 2019 నాటికి మరో రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత 2024 నాటికి ఒక్కో ఎంపీ మరో ఐదు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయాలన్నది ఈ పథకం లక్ష్యం. అలా ప్రతి యేటా కొందరు ఎంపీలు తమ నియోజకవర్గాల్లో గ్రామాలను దత్తత తీసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పథకం అంతగా ముందుకెళ్లకపోవడానికి ప్రధానం రెండు అడ్డంకులు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటే నియోజకవర్గంలోని మిగతా గ్రామాలు సదరు ఎంపీ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకటైతే.. ఈ పథకం కోసం ప్రత్యేకంగా నిధులేవీ కేటాయించకపోవడం మరో ప్రతికూలాశంగా భావిస్తున్నారు. అయితే ఈ పథకం ప్రధాని మానస పుత్రిక కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ పట్టుదలగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరోవైపు ఎస్ఏజీవై పథకం అసలు లక్ష్యం నెరవేరనందున ఈ పథకాన్ని ఇంకా ప్రారంభం కానిదిగానే (నాన్‌స్టార్టర్) పరిగణించాలని సీఆర్ఎం పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయిలో సమీక్షించి మరింత ప్రభావవంతంగా అమల్లోకి తేవాలని సూచించింది. 

Updated Date - 2020-06-22T19:12:48+05:30 IST