బిడ్డల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే రాజకీయాలు చేశారు : మోదీ ఫైర్

ABN , First Publish Date - 2020-10-31T16:20:27+05:30 IST

ఉక్కు మనిషి సర్దార్ వల్లభా భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘యూనిటీ ఆఫ్ స్ట్యాచ్యూ’’ వద్ద నివాళులర్పించారు.

బిడ్డల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే రాజకీయాలు చేశారు : మోదీ ఫైర్

అహ్మదాబాద్ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభా భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘యూనిటీ ఆఫ్ స్ట్యాచ్యూ’’ వద్ద నివాళులర్పించారు. ‘రాష్ట్రీయ ఏకతా దివస్’ ను పురస్కరించుకొని జరిగిన పోలీస్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. కరోనా సంక్షోభ వేళ దేశం మొత్తం ఐక్యంగా ఆ మహమ్మారితో పోరాడిందని.. అలాగే సర్దార్ పటేల్ కూడా దేశ ఐక్యత కోసం పోరాడారని మోదీ అన్నారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిందని, దేశ పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేశం తన సామాజిక బలాన్ని, శక్తిని ప్రదర్శించడం చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని ఆయన అన్నారు. 130 కోట్ల మంది భారతీయులు కోవిడ్ వారియర్స్ కు సత్కారాలు, గౌరవాలు అందించారని, అంతటి క్లిష్ట సమయంలో కూడా దేశం ఐక్యంగా తన శక్తిని చాటిందని పేర్కొన్నారు. సోమనాథ క్షేత్ర పునర్నిర్మాణ ప్రక్రియ ద్వారా దేశ సాంస్కృతిక గౌరవాన్ని తిరిగి తీసుకురావడానికి పటేల్ ఓ పెద్ద యజ్ఞాన్నే చేశారని, దానికి కొనసాగింపే రామ మందిర నిర్మాణమని అన్నారు. భవ్య రామ మందిర నిర్మాణాన్ని ఈ రోజు మనం చూస్తున్నామని అన్నారు.


పుల్వామా దాడిని కొన్ని పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నాయని అన్యాపదేశంగా ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ‘‘దేశానికి అంతపెద్ద గాయమైనప్పుడు వారు ఎలాంటి ప్రకటనలు చేశారో మనం చూశాం. అసభ్యకరమైన విషయాలు మాట్లాడారు.  ఆ సమయంలో నేను వివాదాస్పద ప్రకటనలు చేయకుండా మౌనంగా ఉండిపోయాను. ఆ మాటలతో నేను చాలా బాధపడ్డా.  దాయాది పాకిస్తాన్ ఉచ్చులో ఎవరూ పడకూడదని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నా.’’ అని మోదీ చురకలంటించారు. అంతటి క్లిష్ట సమయంలో కూడా రాజకీయాలు చేసిన వారిని దేశం ఎన్నటికీ మరిచిపోదని హెచ్చరించారు. పార్లమెంట్‌లో ఓరకంగా ప్రమాణం చేస్తారని, కానీ ఆయా పార్టీల నిజమైన స్వరూపం ఆ సమయంలో బయటపడిందని, స్వార్థ రాజకీయాల కోసం ఎంత దూరమైన వెళ్లగలరన్నది నిరూపితమైందని మోదీ నిప్పులు చెరిగారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని, జవాన్ల మనోబలాన్ని దెబ్బతీసే రాజకీయాలు చేయవద్దని రాజకీయ పక్షాలను విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల స్వార్థ రాజకీయాల కోసం వారికి తెలిసో, తెలియకో దేశ వ్యతిరేక శక్తుల చేతిలో పావులుగా మారకూడదని మోదీ పిలుపునిచ్చారు.


జమ్మూ కశ్మీర్ లో శాంతిని నెలకొల్పడం ద్వారా అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందని, అభివృద్ధి అనేక కోణాల్లో జరుగుతోందని అన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అశాంతి వల్ల గానీ, ఉగ్రవాదం వల్ల కానీ ఏ ఒక్క దేశమూ లాభం పొందిన దృష్టాంతాలు లేవని పేర్కొన్నారు. భారత దేశం ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.


‘సీప్లేన్’ సర్వీసును ప్రారంభించిన ప్రధాని మోదీ

సర్దార్ సరోవర్ నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ వరకూ ‘సీప్లేన్’ సర్వీసును ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. సీప్లేన్ సర్వీసు ద్వారా ఈ ప్రాంతం టూరిజం బాగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సర్దార్ సరోవర్ డ్యాం నుంచి సబర్మతీ రివర్ ఫ్రంట్ వరకూ సీప్లేన్ సర్వీసును ప్రారంభించుకున్నాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీని చూడడానికి ప్రజలు ఈ సేవలను కూడా వినియోగించుకోవచ్చు. ఈ సేవలు ఈ ప్రాంతంలోని టూరిజాన్ని బాగా బలోపేతం చేస్తాయి. నేడే వాల్మీకి జయంతి కూడా. ఈ రెండూ యాదృచ్ఛికంగానే వచ్చాయి. సాంస్కృతిక ఐక్యతను ఈ రోజు మనం చూడొచ్చు. ఈ రోజు మనం అనుభవిస్తున్న శక్తిమంతమైన భారతాన్ని వాల్మీకి కొన్ని శతాబ్దాల కిందటే చేశారు.’’ అని మోదీ తెలిపారు. 

Updated Date - 2020-10-31T16:20:27+05:30 IST