మోదీ అందుకే చైనాలో పాపులర్ అయ్యారు : కాంగ్రెస్ సెటైర్

ABN , First Publish Date - 2020-06-27T01:43:27+05:30 IST

భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదన్న వ్యాఖ్యలతోనే ప్రధాని మోదీ చైనాలో చాలా పాపులర్

మోదీ అందుకే చైనాలో పాపులర్ అయ్యారు : కాంగ్రెస్ సెటైర్

ముంబై : భారత భూభాగంలోకి ఎవరూ చొరబడలేదన్న వ్యాఖ్యలతోనే ప్రధాని మోదీ చైనాలో చాలా పాపులర్ ఫిగర్ అయిపోయారని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్విరాజ్ చవాన్ ఎద్దేవా చేశారు. ఎవరూ చొరబడలేదన్న ప్రధాని వ్యాఖ్యలు జవాన్ల ఆత్మ స్థైర్యాన్ని పూర్తిగా దెబ్బ తీశాయని మండిపడ్డారు.


‘‘గాల్వాన్ లో జరిగిన చొరబాట్లపై తీవ్ర ఆందోళన చెందుతున్నాం. అలాగే జవాన్లు చూపిన తెగువను చూసి గర్విస్తున్నాం. సరిహద్దులను రక్షించడం, చొరబాట్లను నియంత్రించడం ప్రభుత్వ బాధ్యత. కాంగ్రెస్ పదే పదే ఇవే అంశాలను లేవనెత్తుతున్నా... ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది’’ అని విమర్శించారు.


గాల్వాన్ విషయంలో కేంద్రంలో కూడా భిన్న స్వరాలున్నాయన్నారు. ఎల్‌ఐసీలో చైనా నిర్మాణ కార్యకలాపాలున్నాయని విదేశాంగ మంత్రి ప్రకటిస్తే, ప్రధాని మాత్రం చొరబాట్లు లేవని ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. భారత భూభాగంలోనే చైనా దళాలు టెంట్లు వేసుకున్నాయని ఉపగ్రహ ఛాయా చిత్రాలు చూపిస్తున్నాయని, ఆర్మీ వాహనాలు, బుల్డోజర్లు కూడా కనిపిస్తున్నాయని తెలిపారు. గాల్వాన్ వ్యాలీలో పది వేల మంది చైనా సైనికులున్నారని, గాల్వాన్ లోకి చైనా ఎన్నిసార్లు చొరబడిందో కేంద్రం చెప్పాలని పృథ్విరాజ్ చవాన్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-06-27T01:43:27+05:30 IST