దేవెగౌడకు మోదీ ఫోన్... ఎందుకంటే?

ABN , First Publish Date - 2020-05-18T18:11:46+05:30 IST

జనతాదళ్ సెక్యులర్ అధినేత, మాజీ ప్రధానమంత్రి హరదనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.

దేవెగౌడకు మోదీ ఫోన్... ఎందుకంటే?

న్యూఢిల్లీ: జనతాదళ్ సెక్యులర్ అధినేత, మాజీ ప్రధానమంత్రి హరదనహళ్లి దొడ్డెగౌడ దేవెగౌడకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు దేవెగౌడకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్ధిస్తానంటూ మోదీ ట్వీట్ చేశారు. దేవెగౌడ 87వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 1933 మే 18న కర్ణాటకలో రైతు కుటుంబంలో జన్మించిన దేవెగౌడ ఒక్కలిగ కులానికి చెందినవారు. సివిల్ ఇంజనీరింగ్‌ డిప్లొమా చేసిన దేవెగౌడ 1953లో తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత 1989 వరకూ ఆరుసార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1972లో కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్ష అనుభవించారు. అనంతరం జనతాదళ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1994లో కర్ణాటక సీఎంగా పనిచేశారు. 1996లో దేశ ప్రధాని అయ్యారు. ప్రస్తుతం జనతాదళ్ సెక్యులర్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేవెగౌడ కుమారుడు కుమారస్వామి జనతాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కుమారస్వామి గతంలో కర్ణాటక సీఎంగా కూడా పనిచేశారు. 

Updated Date - 2020-05-18T18:11:46+05:30 IST