10 రోజుల్లో కట్టడి చేయగలం!
ABN , First Publish Date - 2020-04-05T07:22:25+05:30 IST
దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, తబ్లిగీ జమాత్ సమావేశాల వంటి ఒకట్రెండు అనుకోని పరిణామాలు జరిగినా పరిస్థితి చేయిదాటి పోలే దని ప్రధాని మోదీకి కేంద్ర సాధికారిక బృందాలు నివేదించాయి.

పరిస్థితి అదుపులోకి వస్తోంది..
ఎక్కడ బయటపడ్డా యుద్ధ ప్రాతిపదికన చర్యలు
ప్రధానికి సాధికారిక బృందాల నివేదన
పీపీఈలు, మాస్క్‌లకు కొరత రానివ్వొద్దు
అధికారులకు మోదీ ఆదేశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉందని, తబ్లిగీ జమాత్ సమావేశాల వంటి ఒకట్రెండు అనుకోని పరిణామాలు జరిగినా పరిస్థితి చేయిదాటి పోలే దని ప్రధాని మోదీకి కేంద్ర సాధికారిక బృందాలు నివేదించాయి. శనివారం మోదీ ఈ బృందాల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని స్వయంగా సమీక్షించారు. రానున్న 10 రోజుల్లో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమన్న నమ్మకాన్ని అధికారులు వ్యక్తం చేశారు. దేశంలో ఏమూల వైరస్ సమాచారం లభించినా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని చెప్పినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మాస్కులు, గ్లోవ్స్, వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ), వెంటిలేటర్లు, అత్యవసర మందులు.. మొదలైనవన్నీ దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు, ఐసోలేషన్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండేట్లు చూడాలని ప్రధాని ఆదేశించారు. సరిపడకపోతే వాటి ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రులు, క్వారంటైన్ సెంటర్లు, ఐసీయూలు, ఐసోలేష న్ కేంద్రాల్లో పరిస్థితి, కొత్తగా ఎన్ని అవసర మవుతాయి, వాటిలో యుద్ధ ప్రాతిపదికన ఏమేం ఏర్పాటు చేయాలి.. మొదలైన వాటిపై ఆయన సమీక్షించారు. వ్యాధి విస్తరణపై నిఘా, సోకినవారికి అందుతున్న సాయం, పరీక్షలు, క్రిటికల్ కేర్ ట్రైనింగ్ మొదలైనవన్నీ నిరంతరం ఎలాంటి ఇబ్బందీ లేకుండా సాగాలన్నారు. కోవిడ్-19కు సంబంధించి విపత్తు యాజమాన్య చట్టం క్రింద కలిసికట్టుగా చర్యలు తీసుకునేందుకు ప్రధాని ఈ నెల 29న 11 కీలక సాధికారిక బృందాలను ఏర్పాటు చేశారు. సకాలంలో అమలు చేయడానికి ప్రణాళికలను రూపొందించి తగిన చర్యలు తీసుకునే అధికారాన్ని వీటికి కల్పించారు. లాక్డౌన్ సమయం లో చర్యలతో పాటు ఎత్తేశాక కూడా ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా అన్నీ సమృద్ధిగా ఉండేట్లు చూడడం వీటి లక్ష్యం. కాగా, కీలక వైద్య ఉపకరణాల ఎగుమతిపై కేంద్రం నియంత్రణ విధించింది. డయాగ్నస్టిక్ కిట్స్, ప్రయోగశాలల్లో వాడే సామగ్రిని ఎగుమతి చేయడానికి వీల్లేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ తెలిపింది.
8న ప్రధాని అఖిలపక్ష సమావేశం
ఈనెల 8వ తేదీ ఉదయం 11గంటలకు మోదీ అన్ని పార్టీల పార్లమెంటరీ విభాగాల నేతలతో సమావేశమై కొవిడ్-19 కట్టడికి తీసుకుంటున్న చర్యలు వివరిస్తారు. వారి సలహాలు, సూచనలు తీసుకుంటారు. ‘ఐదుగురు సభ్యులున్న ప్రతీపార్టీ నేతను ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుస్తారు. లాక్డౌన్ తర్వాత ఆయన విపక్ష నేతలను కలవడం ఇదే ప్రథమం’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు.
కరోనాపై ట్రంప్-మోదీ చర్చ
కరోనావైరస్ కట్టడికి రెండు దేశాలూ పూర్తి శక్తిని వినియోగిద్దామని భారత్, అమెరికా అంగీకారానికి వచ్చాయి. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలపై ట్రంప్, మోదీ శనివారం ఫోన్లో చర్చించారు. ‘అన్ని అంశాలనూ విస్తృతంగా చర్చించాం. ఇండో అమెరికా భాగస్వామ్యపు పూర్తి బలాన్ని వాడుకోవాలని నిర్ణయించాం’ అని మోదీ ట్వీట్ చేశారు. వైద్య సామగ్రి కోసం ప్రపంచ దేశాల సాయాన్ని అమెరికా కోరుతోంది. కాగా, బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోతోనూ మోదీ ఫోన్లో మాట్లాడారు. కరోనాపై రెండు దేశాలు కలిసి పోరాడాలని ఇరువురు అంగీకారానికి వచ్చారు.
దీపాలు వెలిగించండి
వాజ్‌పేయి కవితను షేర్ చేసిన మోదీ
ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్ లైట్లు ఆర్పి చమురు లేదా కొవ్వొత్తి దీపాలు వెలిగించండని మోదీ మరోమారు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్విటర్ ద్వారా విజ్ఞాపన చేసిన ఆయన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గతంలో ఓ సభలో చదివిన కవితను షేర్ చేశారు. ‘రండి.. దీపాన్ని వెలిగించండి’ అని ఉన్న ఆ కవితలో పంక్తిని మోదీ ప్రస్తావించారు. ఆవో ఫిర్ సే దియా జలాయేం... అన్నది వాజ్‌పేయి కవితా పంక్తి..