కోవిడ్-19: రేపు ముఖ్యమంత్రులతో ప్రధాని కీలక సమావేశం
ABN , First Publish Date - 2020-04-01T23:23:27+05:30 IST
దేశంలోని ముఖ్యమంత్రులందరితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు...

న్యూఢిల్లీ: దేశంలోని ముఖ్యమంత్రులందరితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు. ప్రాణాంతక మహమ్మారి కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించనున్నారు. దేశ వ్యాప్తంగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో ప్రధాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా కరోనా వైరస్‌పై పోరాడేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గత నెల 20న ముఖ్యమంత్రులందరితో సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాపించే అవకాశం ఉన్నందున.. ఈ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రధాని పిలుపునిచ్చారు.
కరోనా సవాలును ఎదుర్కునేందుకు దేశ ప్రజల సహకారం కూడా చాలా అవసరమని, అనవసరంగా భయాందోళనలకు గురికావద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ సూచించారు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1637 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 386 కొత్త కరోనా కేసులు నమోదైనట్టు పేర్కొంది. కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు 38 మంది ప్రాణాలు కోల్పోగా.. 132 మంది ఈ మహమ్మారిని ఓడించి క్షేమంగా బయటపడ్డారు.